జీహెచ్ఎంసీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగంలో ట్రాన్స్‌ఫర్స్
నగర పరిశుభ్రతను మరింతగా మెరుగుపరిచేందుకు బల్దియా చర్యలు
హైదరాబాద్, డిసెంబర్ 28(ఆదాబ్ హైదరాబాద్): గ్రేటర్ హైదరాబాద్ మునిపల్ కార్పొరేషన్(GHMC) పరిధి విస్తరణతోపాటు పరిపాలనా సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్(SWM) విభాగంలో 60 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల(DEE)ను బదిలీ చేస్తూ బల్దియా కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు(ORR) పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 27 మునిపాలిటీ(Municipality)లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా జీహెచ్‌ఎంసీని 12 జోన్లు, 60 సర్కిల్స్‌గా పునర్వ్యవస్థీకరించారు.
ఈ నేపథ్యంలో విస్తరించిన గ్రేటర్ పరిధిలో చెత్త సేకరణ, నిర్వహణ సమర్థవంతంగా సాగేందుకు ఈ బదిలీలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికిందరాబాద్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలోని వివిధ సర్కిల్స్‌కు ఈ ఇంజినీర్లను నియమించారు. బదిలీ అయిన ఇంజినీర్లు వెంటనే కొత్త పోస్టుల్లో బాధ్యతలు స్వీకరించాలని, సంబంధిత సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు దీనికి సహకరించాలని ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ విస్తరించిన నేపథ్యంలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచేందుకు ఈ చర్యలు దోహదపడనున్నాయి.
