Sunday, May 10, 2026
Homeమహబూబ్‌నగర్‌Self Employment | ఉచిత శిక్షణలతో స్వయం ఉపాధికి బాటలు

Self Employment | ఉచిత శిక్షణలతో స్వయం ఉపాధికి బాటలు

  • శిక్షణ అనంతరం ముద్రా రుణాలకు సైతం సహాయం.
  • వనపర్తి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ అనిల్ కుమార్ వెల్లడి..

వనపర్తి జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ముందుకొచ్చింది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా వివిధ వృత్తి ఆధారిత ఉచిత శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తూ యువతకు ఉపాధి దిశగా మార్గనిర్దేశం చేస్తోంది. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, కనీసం పదో తరగతి అర్హత ఉన్న అభ్యర్థులు ఈ శిక్షణలకు దరఖాస్తు చేసుకోవచ్చని వనపర్తి శిక్షణ సంస్థ డైరెక్టర్ అనిల్‌కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

శిక్షణ లో భాగంగా అభ్యర్థులకు ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించి.. శిక్షణ పూర్తయిన అనంతరం ఆయా రంగాల్లో స్వయం ఉపాధి ప్రారంభించేందుకు అవసరమైన సలహాలు, మార్గదర్శకంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ముద్రా పథకం ద్వారా రుణాలు పొందేందుకు అవసరమైన సహకారం అందిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం మగ్గం వర్క్ కోర్సుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా కోర్సులు

యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని సూచించారు. తక్కువ వ్యవధిలోనే శిక్షణ పూర్తి చేసి ఆదాయం పొందే అవకాశాలు ఈ కోర్సుల ద్వారా లభిస్తాయని తెలిపారు.
మహిళలు, పురుషులు తమ ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నారు.

  • సంస్థలో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు.

టైలరింగ్ (30 రోజులు), మగ్గం వర్క్ (30 రోజులు) సీసీ కెమెరా టెక్నీషియన్, (13 రోజులు) ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ (31 రోజులు), ఇమిటేషన్ జ్యువెలరీ తయారీ (14 రోజులు), కొవ్వొత్తులు, అగరబత్తుల తయారీ (13 రోజులు), హౌస్ వైరింగ్ (31 రోజులు), ఎల్‌ఎంవీ కారు డ్రైవింగ్ (31 రోజులు), జనరల్ ఈడీపీ (6 రోజులు), ఎలక్ట్రిక్ మోటార్ రివైండింగ్ సర్వీసెస్ (31 రోజులు), సెల్‌ఫోన్ రిపేర్ అండ్ సర్విసింగ్ (31 రోజులు), బ్యూటీ పార్లర్ (35 రోజులు), రిఫ్రిజిరేటర్ & ఎయిర్ కండిషనింగ్ వర్క్ (30 రోజులు), టూ వీలర్ మెకానిక్ (30 రోజులు), తేనెటీగల పెంపకం, తేనె తయారీ (20 రోజులు), పుట్టగొడుగుల పెంపకం (10 రోజులు) వంటి అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గ్రామీణ యువతీ, యువకులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు వనపర్తి మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో సంప్రదించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు కింది ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు (8522088978,9885940945,7981684174).

- Advertisement -
RELATED ARTICLES

Latest News