- చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన కన్స్యూమర్ సభ్యులు..
- విజయవంతంగా కొనసాగుతున్న భారత వినియోగదారుల చైతన్య యాత్ర..
కన్స్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “భారత వినియోగదారుల చైతన్య యాత్ర” దేశవ్యాప్తంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ, అవగాహన, చట్టపరమైన జ్ఞానం విస్తరణ లక్ష్యంగా ఘనంగా కొనసాగుతోంది. ఈ యాత్రకు భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ యాత్ర డిసెంబర్ 24, 2025న జాతీయ వినియోగదారుల దినోత్సవం నాడు ఢిల్లీలో ప్రారంభమై, మార్చ్ 15, 2026.. అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం నాటికి మళ్లీ ఢిల్లీ చేరుకునేలా “ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు” దేశవ్యాప్తంగా కొనసాగుతోంది.
యాత్రకు సీసీఐ జాతీయ చైర్మన్ డాక్టర్ అనంత శర్మ, జస్టిస్ ప్రీతి పాండే నాయకత్వం వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల హక్కులు, వినియోగదారుల పరిరక్షణ చట్టం – 2019, ఆహార పదార్థాల కల్తీ, నాణ్యత ప్రమాణాలు, తూకాలు-కొలతలు, సైబర్ మోసాలు తదితర అంశాలపై ర్యాలీలు, సెమినార్లు, అవగాహన సదస్సుల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ యాత్ర డిసెంబర్ 28, 2025 న ప్రవేశించి జనవరి 31, 2026 వరకు వివిధ జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించబడింది. ర్యాలీలు, కాలేజీలు, యూనివర్సిటీలు, కమ్యూనిటీ హాళ్లలో నిర్వహించిన సెమినార్ల ద్వారా వేలాది మంది విద్యార్థులు, యువత, మహిళలు, సామాన్య ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ డీకే అరుణని యాత్రలో పాల్గొనమని ఆహ్వానించినప్పటికీ పార్లమెంట్ సమావేశాల కారణంగా ఆమె హాజరుకాలేకపోయారు. అనంతరం సీసీఐ తెలంగాణ ప్రతినిధులు ఆమెను కలిసి యాత్ర వివరాలను తెలియజేసి, భవిష్యత్ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా రావలసిందిగా ఆహ్వానించారు. అదే విధంగా, ఎఫ్‌సీఐ ద్వారా ఆహార ధాన్యాల సేకరణలో జరుగుతున్న అవకతవకలను నివారించి పారదర్శక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి పత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో సీసీఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మామిడి భీమ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు అందె శ్రీధర్ రెడ్డి, ఎం. ప్రవీణ్ పాల్గొని, గత సంవత్సరం నుండి తెలంగాణలో దాదాపు 25 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు.
ఈ సెమినార్లలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రీడ్రెస్సల్ కమిషన్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (మెడికల్ నిర్లక్ష్యంపై అవగాహన), సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ ఫ్రాడ్స్సం స్థల పాత్ర, చట్టాలు, బాధ్యతలపై అవగాహన కల్పించబడిందని సీసీఐ తెలంగాణ నాయకులు తెలిపారు: ప్రతి పౌరుడికి చట్టపరమైన హక్కులు తెలుసుకోవడం అవసరమని, భవిష్యత్తులో మరింత విస్తృతంగా గ్రామ స్థాయికి ఈ అవగాహన కార్యక్రమాలను తీసుకెళ్తామని తెలిపారు.
