- ఆచార్య శ్రీనివాస వరఖేడి
ప్రపంచమంతటా శాంతి,స్థిరత్వం,సౌభ్రాతృత్వం నిలవాలంటే ధర్మమే మూలాధారమని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం,న్యూ ఢిల్లీ ఉపకులపతి ఆచార్య శ్రీనివాస వరఖేడి అన్నారు.ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరణలో పెట్టినప్పుడే సమాజం సుస్థిరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని సంస్కృత అకాడమీలో ధర్మశాస్త్రంపై నిర్వహిస్తున్న ఏడు రోజుల కార్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ధర్మం యొక్క తాత్విక,సామాజిక,ఆచరణాత్మక కోణాలను విశదీకరించారు.
ధర్మం వ్యక్తిగత జీవితం నుంచి సామాజిక వ్యవస్థ వరకూ మార్గదర్శక శక్తిగా పనిచేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో సంస్కృత భారతి తెలంగాణ ప్రాంత అధ్యక్షులు,ఋగ్వేద పండితులు నరేంద్ర కాప్రే గారు గౌరవ అతిథిగా పాల్గొని ధర్మశాస్త్ర ప్రాధాన్యతను వివరించారు.శ్రీమాన్ సి.హెచ్. లక్ష్మానాథాచార్యులు,ఆచార్య కె. నీలకంఠం సందేశాలు ఇచ్చారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆచార్య పెన్నా మధుసూదన్ ధర్మశాస్త్రం యొక్క శాస్త్రీయ విలువ,సమకాలీన అవసరాలను వివరించారు.కార్యక్రమాన్ని డా. జోషి సంతోష్ కుమార్ సమన్వయం చేశారు.సందర్భంగా ధర్మోదంతం గ్రంథాన్ని అతిథులు ఘనంగా ఆవిష్కరించారు.ధర్మశాస్త్రంపై ఇలాంటి కార్యశాలలు విద్యార్థులు,పరిశోధకులకు ఎంతో ఉపయోగకరమని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.
