- రైతులకు సూచనలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు..
- వాతావరణ శాఖ సూచనలు పాటించాలి..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేడు తుపానుగా మారింది. ఈ తుపానుకు ‘అర్ణబ్'(Cyclone Arnab) అని నామకరణం చేశారు. ‘అర్ణబ్’ తుపాను(Cyclone Arnab) ఏపీ దిశగా వస్తోందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. అనవసరమైన వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారత వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా యంత్రాంగం ఇచ్చే సూచనలను మాత్రమే పాటించాలని సోమవారం స్పష్టం చేశారు. ఈ విపత్కర సమయంలో ప్రజలందరూ సమన్వయంతో, ముందస్తు అప్రమత్తతతో వ్యవహరించి తుపాను గండం నుంచి సురక్షితంగా బయటపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు మంత్రి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సూచనలు జారీ చేశారు.
తీరం దాటేది అప్పుడే.. రెడ్ అలర్ట్ జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అర్ణబ్’ తుపానుగా(Cyclone Arnab) మారి వేగంగా బలపడుతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది అక్టోబర్ 26, సోమవారం అర్ధరాత్రికి తీవ్ర తుపానుగా, మరుసటి రోజు అక్టోబర్ 27న అతి తీవ్ర తుపానుగా మారనుందని తెలిపారు. అక్టోబర్ 28, బుధవారం ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్లు, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 27, 28 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.
ప్రాణరక్షణకే తొలి ప్రాధాన్యం
ఈ విపత్తు సమయంలో ప్రజల ప్రాణరక్షణకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలు తక్షణమే అధికారులు సూచించిన సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని కోరారు. ప్రతి ఒక్కరూ అత్యవసర మందులు, తాగునీరు, ఆహార పొట్లాలు, టార్చ్లైట్లు, బ్యాటరీలు, ముఖ్యమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
బలహీనమైన భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులకు దూరంగా ఉండాలని, వర్షాలు, పిడుగుల సమయంలో బయటకు రావద్దని హెచ్చరించారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వెళ్లినవారు వెంటనే తీరానికి చేరుకోవాలని ఆదేశించారు.
రైతన్నలకు ప్రత్యేక సూచనలు
రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ వంటి పంటలను వాతావరణం అనుకూలించగానే కోసి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ధాన్యం రాశులు, ఇతర ఉత్పత్తులను టార్పాలిన్లతో కప్పి భద్రపరచుకోవాలన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
