ఉద్యోగులు, సిబ్బంది ఇష్టారాజ్యం
జీహెచ్ఎంసీ ఖజానాకు గండి
నిబంధనలకు విరుద్ధంగా వాటర్, డ్రైనేజ్, పైపులైన్ కనెక్షన్లు
అందినకాడికి దోచుకుంటున్న వైనం
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం!
జల మండలి తార్నాక సెక్షన్ సబ్ డివిజన్‌లో కొంత మంది ఉద్యోగులు మంచి నీటి నల్లా కనెక్షన్(Water), డ్రైనేజ్(Drainage) కనెక్షన్(Connection) ఇవ్వడానికి అక్రమ వసూళ్ల(Illegal Collections)కు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నీటి కనెక్షన్లు, డ్రైనేజ్ కనెక్షన్లు ఇచ్చే విషయంలో జల మండలి ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా(Rules Breaking) వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్లా కనెక్షన్లు, డ్రైనేజ్ కనెక్షన్ల విషయంలో జల మండలి అధికారులు అనుమతులు ఇవ్వడమే ఆలస్యం ఆ తర్వాత అంతా తామే అన్నట్లు పని మొదలు నుంచి ముగింపు వరకు జల మండలిలో పనిచేసే కొంత మంది సిబ్బంది పూర్తి చేస్తారని సమాచారం.
ఒక్కో ఇంటి నల్లా కనెక్షన్‌కు, డ్రైనేజ్ కనెక్షన్‌కి రోడ్డు వెడల్పును బట్టి ఎంత ధర అనేది సిబ్బంది నిర్ణయిస్తారంట. ఈ పని మొత్తాన్ని వీరు ప్రైవేట్‌గా నియమించుకున్న కూలీలతోనే పని పూర్తి చేయిస్తారని ప్రజలు చెబుతున్నారు. జల మండలిలో ఉద్యోగులుగా ఉన్న వీరు నల్లా, డ్రైనేజ్ కనెక్షన్ విషయంలో ఇంటి యజామాని నుంచి అడ్డగోలుగా అక్రమ వసూళ్లకు పాల్పడుతుంటారని పలువురు విమర్శిస్తున్నారు. ఇదంతా జల మండలి అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు కోకొల్లలుగా వినిపిస్తున్నాయి. నల్లా, డ్రైనేజ్ కనెక్షన్ కోసం రోడ్ ఫుట్‌పాత్ తవ్వడానికి జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం నుంచి అనుమతులు తీసుకోవాలి.
ఆ విషయం తెలిసి కూడా జల మండలి అధికారులు, సిబ్బంది ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కాసుల కోసం కక్కుర్తిపడి అక్రమ మార్గంలో కనెక్షన్లు పూర్తిచేస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అక్రమంగా ఫుట్‌పాత్, పబ్లిక్ రోడ్ తవ్వి జల మండలి విభాగం కనెక్షన్ ఇచ్చిందని తెలుసుకున్న జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు సంబంధిత వ్యక్తులకు రోడ్ ఫుట్‌పాత్ తవ్వినందుకు జరిమానా విధించడంతో ఆ వ్యక్తులు జల మండలి సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. తార్నాక జల మండలిలో కొంత మంది ఉద్యోగులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
దీనిపై జల మండలి అధికారులకు కొంత మంది ఫిర్యాదు చేయగా ఆ ఉద్యోగులకు అధికారులు మెమోలు జారీ చేయకపోగా కనీసం మందలించిన దాఖలాలు కూడా లేవని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా నల్లా కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్ విషయంలో అవినీతికి పాల్పడుతున్న అధికారులు, సిబ్బందిపై సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు, బాధితులు కోరుతున్నారు.

