ఉస్మానియా యూనివర్సిటీ(OU)లో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, బోధనా సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. ఓయూ అభివృద్ధి పనులకు సంబంధించి ఎంత మొత్తమైనా ఖర్చు చేసేందుకు వెనకాడబోమని తెలిపారు.
- ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
- యూనివర్సిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై తొలుత అధికారులు వివరించారు.
- అనంతరం పనులకు సంబంధించిన వివిధ మోడళ్ల పవర్ పాయింట్ ప్రజంటేషన్స్‌ను సీఎం వీక్షించారు.
- హాస్టల్ భవనాలు, రహదారులు, అకడమిక్ బ్లాక్స్, ఆడిటోరియం నిర్మాణాలకు సంబంధించి పలు మార్పులు చేర్పులను సూచించారు.
- యూనివర్సిటీ పరిధిలోని అటవీ ప్రాంతంలో పనులకు అర్బన్ ఫారెస్ట్రీ నిధులు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు.
- యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికే ఉన్న జల వనరులను సంరక్షిస్తూనే నూతన జల వనరుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
- హాస్టల్, అకడమిక్ భవనాల నిర్మాణం విషయంలో వంద మంది విద్యార్థులుంటే అదనంగా మరో పది శాతం విద్యార్థులకు వసతులు ఉండేలా చూడాలని తెలిపారు.
- విద్యార్థులు, సిబ్బంది భవిష్యత్తులోనూ ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా నిర్మాణాలు ఉండాలని సీఎం అన్నారు.
- యూనివర్సిటీ పరిధిలోని చారిత్రక, వారసత్వ భవనాలను సంరక్షించాలని చెప్పారు.
- చారిత్రక ప్రాధాన్యంలేని పురాతన భవనాలకు భారీ మొత్తాలు వెచ్చించి మరమ్మతులు చేసే బదులు నూతన భవనాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
- సైకిల్ ట్రాక్‌లు, వాకింగ్ పాత్‌లతోపాటు ప్రతి పనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు.
- ఉస్మానియా విద్యార్థుల పోరాట ప్రతిమను ప్రతిబింబించే చిహ్నాలు ఏర్పాటుచేయాలని సూచించారు.
- ఈ నెల 10 ఓయూను సందర్శించనున్నట్లు (OU Visit) సీఎం చెప్పారు.
- ప్రధానంగా అకడమిక్ బ్లాక్‌లు, హాస్టళ్లను పరిశీలిస్తానని చెప్పారు.
- యూనివర్సిటీ అభివృద్ది పనుల విషయంలో విద్యార్థులు, బోధనా సిబ్బంది అభిప్రాయాలు స్వీకరించాలని పేర్కొన్నారు.
- తొలుత అభివృద్ధి నమూనాలు వారి ముందు ఉంచాలని.. తర్వాత వారి అభిప్రాయాలు తెలిపేందుకు డ్రాప్ బాక్స్(Drop Box)లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక వెబ్‌సైట్(Special Website)ను ఏర్పాటుచేయాలని సూచించారు.
- వారి అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తూ ఈ నెలాఖరు నాటికి అభివృద్ధి ప్రణాళికలపై తుది నిర్ణయం ఖరారు కావాలని తెలిపారు.
- ఈ సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ మొలుగురం కుమార్, ఆర్ట్స్ కాలేజీ (Arts College) ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీంతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- Advertisement -

