- మండల స్థాయి టాలెంట్ టెస్ట్.
- విద్యార్థులు నూతన సాంకేతికతను
- అందిపుచ్చుకోవాలి ఎంఈఓ సరళ.
- జిల్లా స్థాయికి ఎంపికైన రిత్విక,హర్షిత్ సాయి, ద్రాక్షాయని.
చెన్నారావుపేట మండల విద్యా వనరుల కేంద్రంలో చెన్నారావుపేట ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. చెన్నారావుపేట ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎం ఈ ఓ బైరి సరళ మాట్లాడుతూ విద్యార్థులు నూతన సాంకేతికతను అందిపుచ్చు కోవాలని, విద్యార్థి దశ నుండే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని కోరారు.
నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. భవిష్యత్తు అంతా సాంకేతికమయం అవుతున్నందున విద్యార్థులు సైన్స్ పై మక్కువ పెంచుకోవాలన్నారు. చెన్నారావుపేట మండలంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి వరంగల్ జిల్లా స్థాయికిఎంపికైన విద్యార్థుల వివరాలు ప్రకటించారు.

కేజీబీవీ చెన్నారావుపేట విద్యార్థిని ఏ. రిత్విక, జెడ్పిహెచ్ఎస్ జల్లి విద్యార్థి, బి. హర్షిత్ సాయి, జడ్పీహెచ్ఎస్ ఉప్పరపల్లి విద్యార్థిని సిహెచ్. ద్రాక్షయని జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ సైన్స్ ఫోరం రాష్ట్ర బాధ్యులు పిన్నింటి బాలాజీ రావు పాల్గొని మాట్లాడుతూ జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ వచ్చేవారం వరంగల్ లో నిర్వహిస్తారని,తదుపరి వారం రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహిస్తామని తెలిపారు.
మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు సన్నద్ధులు కావాలన్నారు. ఆర్గనైజర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ కు 15 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేసామన్నారు. కార్యక్రమంలో ఫిజికల్ సైన్స్ రిసోర్స్ పర్సన్ కొండ కృష్ణమూర్తి, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు గొలుసు లక్ష్మయ్య, పల్లవి,దారా అశోక్ మండల విద్యా వనరుల సిబ్బంది పాల్గొన్నారు.
