- కాశ్మీర్ ఎంపీ, మాజీ మేయర్లపై కేసు నమోదు..
- ఫేక్ వీడియోను సృష్టించినందుకు శిక్ష..
సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను పోస్టు చేసిన ఘటనలో.. నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఆఘా సయ్యద్ రుహుల్లా మెహిదితో పాటు శ్రీనగర్ మాజీ మేయర్ జునైద్ అజిమ్ మట్టుపై కేసు నమోదు చేశారు. ప్రజల్లో భయాన్ని నింపేందుకు, మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు తప్పుడు కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు శ్రీనగర్ పోలీసులు తమ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయేల్ దళాలు జరిపిన దాడిలో సుప్రీంనేత ఖమేనీ మృతిచెందిన విషయం తెలిసిందే.
ఆ దాడులను, ఖమేనీ మృతిని ఖండిస్తూ శ్రీనగర్‌లో నిరసనలు చోటుచేసుకున్నాయి. దానికి సంబంధించిన ఓ ఫేక్ వీడియోను ఎంపీ ఆఘా సయ్యద్ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 197(1)(డీ), 353(1)(బీ) కింద కేసు బుక్ చేశారు. రెండు కేసుల్లో దర్యాప్తు మొదలుపెట్టినట్లు పోలీసులు చెప్పారు. అధికారిక, నమ్మదగిన వ్యక్తుల నుంచి ప్రజలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని సరిచూసుకోవాలని పోలీసులు పేర్కొన్నారు. తమ సెక్యూర్టీని తగ్గించినట్లు ఎంపీ మెహది, మాజీ మేయర్ మట్టు తమ ఎక్స్‌లో వెల్లడించారు.
