తనిఖీ చేయకుండా అమ్మకం
హైదరాబాద్ రామంతాపూర్‌లో ఘటన
తయారీలో నాణ్యతా ప్రమాణాలు శూన్యం
ఆకర్షణ కోసం హానికర రసాయనాల మిక్సింగ్
ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాలు వస్తే తప్ప చెకింగ్స్ చేయడంలేదని విమర్శలు
హైదరాబాద్, జనవరి 23(ఆదాబ్ హైదరాబాద్): వయసుతో సంబంధంలేకుండా ప్రతిఒక్కరూ అమితంగా ఇష్టపడే మిఠాయిల (Sweets) తయారీ, అమ్మకంలో కొందరు వ్యాపారులు నిర్లక్ష్యం(Carelessly)గా వ్యవహరిస్తున్నారు. తయారీలో నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేశారు. అమ్మకం సమయంలో కనీసం తనిఖీ చేయకుండా వినియోగదారుల(Customers)కు అంటగడుతున్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్లు నమ్మకంతో కళ్లు మూసుకొని కొనుక్కొని తింటే రోగాల బారినపడే ప్రమాదం ఉంది. రామంతాపూర్‌లో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ.
సాయిరాం హాట్ చిప్స్ షాపులో కొన్న స్వీట్స్‌లో పురుగులు కనిపించాయి. దీన్నిబట్టి.. ఉప్పల్ మండల కేంద్రం, పరిసర ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్వీట్ షాపుల్లో నాణ్యమైన స్వీట్స్‌ను తయారీచేయకుండా కల్తీమయం(Adulteration) చేస్తున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వీట్స్‌ని ఇళ్లలో తయారుచేసుకోవటం కన్నా దుకాణాల్లో కొనుగోలు చేయడానికి జనం ఎక్కువగా ఆసక్తి చూపుతున్న తరుణంలో ఇలాంటివి వెలుగుచూస్తుండటం పట్ల ఆవేదన చెందుతున్నారు.
పెరుగుతున్న ఆహార పదార్థాల దుకాణాలకు తగ్గట్లుగా ఫుడ్ సేఫ్టీ ఉద్యోగులు(Food Safety Employees) లేకపోవడం సమస్యగా మారింది. ఉన్న కొద్దిమంది ఉద్యోగులు కూడా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాలు వస్తే తప్ప తనిఖీలు చేయడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో స్వీట్ల తయారీ దుకాణాల్లో అపరిశుభ్రత, బూజు, పురుగులు, ఈగలు, ఎలుకలు ఉన్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. స్వీట్స్ తినే గడువు ముగిసినా కూడా పట్టించుకోకుండా అమ్ముతున్నారు.
వ్యాపారుల తీరు మారాలంటే అధికారులు ప్రతినెలా తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు చెబుతున్నారు. క్రమంతప్పకుండా చెకింగ్స్ చేసి కలుషిత ఆహారాన్ని కట్టడి చేయాలని, తద్వారా ప్రజలు జబ్బులపాలు కాకుండా రక్షించాలని కోరుతున్నారు.
