కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జనసురక్షా శాచ్యురేషన్ క్యాంపైన్ (జూలై 1 – సెప్టెంబర్ 30, 2025) లో భాగంగా కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు రూరల్ జిల్లా, దొడ్డబళ్లాపుర తాలూకా, కోడిగేహಳ್ಳಿ గ్రామపంచాయతీ పరిధిలో ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ శాచ్యురేషన్ శిబిరంను ఘనంగా నిర్వహించారు. సమీపంలోని తొమ్మిది గ్రామాల నుంచి 700 మందికి పైగా కస్టమర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ కె. సత్యనారాయణ రాజు, ఆర్‌బీఐ బెంగళూరు రీజినల్ డైరెక్టర్ సోనాలి సేన్ గుప్తా, ఆర్‌బీఐ ఎజీఎం అరుణ్ కుమార్, బెంగళూరు రూరల్ జిల్లా ఏడీసీ సయీదా ఇషా, కోడిగేహಳ್ಳಿ పంచాయతీ అధ్యక్షురాలు ఆశా రాణి, సహాధ్యక్షురాలు సౌభాగ్య, కేస్తూరు పంచాయతీ అధ్యక్షుడు మంజునాథ్, కెనరా బ్యాంక్ బెంగళూరు సర్కిల్ సీఎజీఎం మహేష్ ఎం. పై, లీడ్ బ్యాంక్ వెర్టికల్ జీఎం భాస్కర్ చక్రవర్తి, కెనరా బ్యాంక్ దేవనహళ్లి ఎజీఎం కృష్ణ చైతన్య రెడ్డి తదితరులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మరియు కర్ణాటక గ్రామీణ బ్యాంక్ ప్రతినిధులు హాజరయ్యారు.
కార్యక్రమంలో మాట్లాడిన ఆర్‌బీఐ రీజినల్ డైరెక్టర్ సోనాలి సేన్ గుప్తా, రీ-కేవైసీ ప్రక్రియలు పూర్తిచేయడం, ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాలలో నమోదు చేసుకోవడం అత్యవసరమని చెప్పారు. కస్టమర్లు సైబర్ మోసాలకు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని, నిష్క్రియలో ఉన్న ఖాతాలను తిరిగి చురుకుగా మార్చుకోవాలని సూచించారు.
కె. సత్యనారాయణ రాజు, కెనరా బ్యాంక్ ఎండి & సీఈఓ, ప్రధాన ప్రసంగంలో ప్రధానమంత్రి జనధన్ యోజన (PMJDY), ప్రధాన్ మంత్రీ జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన్ మంత్రీ సురక్షా బీమా యోజన (PMSBY), అటల్ పెన్షన్ యోజన (APY) వంటి ప్రధాన ఆర్థిక సమీకరణ పథకాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ పథకాలు కష్టకాలంలో పౌరులకు ఎంతో ఉపయుక్తమయ్యాయని, కేవలం ₹436 (PMJJBY) లేదా ₹20 (PMSBY) ప్రీమియంతో పెద్ద ఆర్థిక భరోసా అందించాయని తెలిపారు. అదేవిధంగా “మనీ మ్యూల్ అకౌంట్స్” ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తూ, సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఈ శిబిరంలో PMSBY, PMJJBY పథకాల కోసం ప్రత్యేక నమోదు కౌంటర్లు, ప్రత్యక్షంగా రీ-కేవైసీ సదుపాయం కల్పించారు. అదేవిధంగా అవతి, దొడ్డబళ్లాపుర, కోడిగేహಳ್ಳಿ బ్రాంచీల నుంచి ఎనిమిది మంది లబ్ధిదారులకు పీఎంఎస్‌బీవై, పీఎంజేజేబీవై పథకాల కింద చెక్కులను అందజేశారు. తమ అనుభవాలను పంచుకున్న లబ్ధిదారులు ఈ పథకాలు ఆర్థిక కష్టకాలంలో ఎంతో మేలు చేశాయని భావోద్వేగంగా వెల్లడించారు.