- డిజిటల్ అరెస్టుల ద్వారా బెదిరింపులు..
- భారతీయ జెండా, గాంధీ, అంబేడ్కర్ లోగోలు లభ్యం..
ఆన్‌లైన్ ద్వారా అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఇటీవల కంబోడియా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి జరుగుతున్న ఏరివేతల్లో భాగంగా ఇటీవల సుమారు 200 డిజిటల్ స్కామ్ కేంద్రాలపై దాడి చేశారు. ఆన్‌లైన్ స్కామ్‌లకు పాల్పడుతూ.. డిజిటల్ అరెస్టుల ద్వారా బెదిరిస్తూ.. కోట్లు కోట్లు కొల్లకొడుతున్న కొన్ని కేంద్రాలపై ఇటీవల కంబోడియా ఉక్కుపాదం మోపింది. అయితే ఓ సెంటర్‌లోకి వెళ్లిన స్థానిక పోలీసు అధికారులు.. అక్కడ ఉన్న సెటప్‌ను చూసి షాక్ అయ్యారు. భారతీయ త్రివర్ణ పతాకం, గాంధీ-అంబేద్కర్ బొమ్మ, భారతీయ పోలీసులకు చెందిన బ్యాడ్జీలు, లోగోలు, దుస్తులు ఉన్నట్లు గుర్తించారు.
సుమారు 190 కేంద్రాలను తాజాగా మూసివేసినట్లు కంబోడియా సీనియర్ మంత్రి చాయ్ సినార్ది తెలిపారు. వియత్నాం బోర్డర్ సమీపంలోని కంపోట్ ప్రావిన్సులో ఉన్న ఓ కేంద్రాన్ని ఆయన ఇటీవల విజిట్ చేశారు. అయితే ఈ డిజిటల్ స్కామ్ సెంటర్ల నుంచి నేరాలకు పాల్పడుతున్న వారిలో 173 మంది అరెస్టు చేసినట్లు చెప్పారు. సుమారు 11 వేల మంది వర్కర్లను కూడా డిపోర్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. ముంబై పోలీసు లోగో, సీబీఐ లోగో, గాంధీ.. అంబేద్కర్ బొమ్మలను వాడుకుని స్కామ్‌లకు పాల్పడుతున్నవారిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
అయితే ఈ స్కామ్‌లో చైనీస్ వ్యక్తి సూత్రధారి అని అనుమానిస్తున్నారు. చైనాలో పుట్టిన ఆ టైకూన్ .. ఈ వ్యవస్థను నడిపిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. చైనాకు చెందిన లీ కువాంగ్ అనే వ్యక్తి డిజిటల్ స్కామ్‌లకు సూత్రధారిగా భావిస్తున్నారు. ఆపరేషన్‌లో భాగంగా కంపోట్‌లో ఉన్న ఓ కేంద్రానికి రిపోర్టర్లను తీసుకెళ్లారు. వాటి వీడియోలను రిలీజ్ చేశారు. అక్కడ వర్క్ రూమ్‌లు చాలా విశాలంగా ఉన్నాయి. కంప్యూటర్ స్టేషన్లు, డెస్క్‌లు చాలా పెద్దగా ఉన్నట్లు గుర్తించారు. బాధితుల్ని ఎలా మోసం చేయాలన్న అంశాలపై డాక్యుమెంట్లు కూడా ఉన్నట్లు తేల్చారు. ఫోన్ కాల్స్ కోసం స్టూడియో బూత్‌లు, భారతీయ నకిలీ పోలీసు స్టేషన్ కూడా ఆ సెంటర్‌లో ఉన్నాయి.
కంపోట్ క్యాసినో కాంప్లెక్స్ నుంచి ఎవర్ని అరెస్టు చేయలేదని అధికారులు చెబుతున్నారు. టైకూన్ లీ కువాంగ్‌ను అరెస్టు చేయడంతో అక్కడున్న వారు పారిపోయినట్లు చెప్పారు. పరారీ అయ్యేవారిని అరెస్టు చేసేంత సిబ్బంది తమ వద్ద లేరని కూడా మంత్రి పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో థాయ్‌ల్యాండ్ బలగాలు జరిపిన దాడి ప్రాంతాలను విజిట్ చేశారు. కంబోడియా భూభాగంలో ఉన్న కొన్ని ప్రాంతాలపై థాయ్ దాడి చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఉన్న కొన్ని స్కామ్ కేంద్రాల్లో వివిధ దేశాలకు చెందిన నకిలీ పోలీసు స్టేషన్లు ఉన్నట్లు గుర్తించారు.
