ముంపు పరిహారం వస్తే పంచాయతీ బరి నుంచి వైదొలుగుతాం
బీఆర్ఎస్ నేత, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి, డిసెంబర్ 7(ఆదాబ్ హైదరాబాద్): గణప సముద్రం ముంపు రైతుల(Ganapa Samudra floods farmers)కు రూ.25 లక్షల నష్టపరిహారం (Compensation) చెల్లిస్తే గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి తప్పుకుంటామని బీఆర్ఎస్ పార్టీ (BRS Party) సీనియర్ నేత, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) బహిరంగ సవాల్ విసిరారు. ఘనపురం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి క్యామ అజంతా తరఫున ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
12 ఏళ్ల కిందట ఘణపురం ఎట్లుండేదో.. ఇప్పుడు ఎట్లా ఉందో.. ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఘణప సముద్రం ముంపు రైతులకు ఎకరాకు రూ.25 లక్షలు నష్టపరిహారం ఇప్పిస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ దొంగలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఎకరాకు రూ.11.75 లక్షలు ఇప్పిస్తాననే మాటకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఇప్పటికైనా రూ.25 లక్షల నష్టపరిహారం ఇస్తామని కాంగ్రెస్ నాయకులు (Congress Party Leaders) మాటిస్తే క్యామ అజంతా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటుందని తేల్చిచెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కొనసాగించలేని దుస్థితి కాంగ్రెస్ నాయకులదని నిరంజన్‌రెడ్డి దుయ్యబట్టారు. పేద ప్రజల కోసం 315 ప్లాట్లు లేఔట్ వేసి సిద్ధంగా ఉంచితే పంపిణీ చేయలేనివారికి పాలించే హక్కు ఎక్కడిదని ఎద్దేవా చేశారు. ఓట్లు అడిగే కాంగ్రెస్ నాయకులను ఆసరా పింఛన్లు 4 వేలు, మహిళకు 2500, కళ్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, ధాన్యానికి బోనస్, కేసీఆర్ కిట్, కంటి వెలుగు పథకాలు ఏవంటూ నిలదీయాలని పిలుపునిచ్చారు. రెండేళ్లలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి కొనసాగించాలంటే క్యామా అజంత కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
