- తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని మరిచిన కాలె యాదయ్య
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారత లక్ష్యంగా “మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద డ్వాక్రా సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ పట్టణంలోని అంజనీ దేవి ఫంక్షన్ హాల్ లో మున్సిపాలిటీ పరిధిలోని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొనడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనన్న విషయాన్ని మరిచినట్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేయడం విడ్డూరమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను బహిరంగంగా విమర్శించే ఎమ్మెల్యే, అదే ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవహరించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు.
అయితే ఈ విమర్శలను పట్టించుకోని ఎమ్మెల్యే కాలె యాదయ్య, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చీరల పంపిణీని కొనసాగించడం కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తల సహనాన్ని పరీక్షించినట్లుగా ఉందని స్థానిక రాజకీయ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
