- యూట్యూబ్ బ్రౌజ్ చేస్తూ మాయలో పడిన వైనం..
- మొదట్లో లాభం.. ఆ తర్వాత నిలువునా మోసం..
యూట్యూబ్‌లో స్టాక్ ట్రేడింగ్ ప్రకటన చూసి దానిని క్లిక్ చేసిన ఓ ప్రైవేట్ ఉద్యోగి, సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కి రూ. 15 లక్షలు పొగొట్టుకున్నాడు. బోడుప్పల్‌కు చెందిన బాధితుడు ప్రైవేట్ ఉద్యోగి. తన సెల్‌ఫోన్‌లో యూట్యూబ్ వీడియో బ్రౌజ్ చేస్తుండగా డిస్కౌంట్‌లో స్టాక్స్ వస్తాయంటూ ఒక ప్రకటన చూశాడు. దానిని క్లిక్ చేయగానే హెచ్14 యాక్సెస్ సెక్యూరిటీస్ పేరుతో ఉన్న వాట్సాప్ నెంబర్‌కు బాధితుడి ఫోన్ నెంబర్ యాడ్ అయ్యింది.
వాట్సాప్‌లో వెబ్‌సైట్ లింక్ పంపించి, అందులో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని సూచించారు. ఇందుకు గ్రూప్ అడ్మిన్ నీలమ్ దావన్ పేరుతో ఒక వ్యక్తి ఫోన్ చేసి సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఇలా మొదట రూ. 75 ఇన్వెస్ట్ చేయడంతో మరుసటి రోజు రూ. 8 వేలు లాభం వచ్చింది. అందులో నుంచి వెయ్యి రూపాయలు విత్ డ్రా చేసుకున్నాడు. డబ్బు విత్ డ్రాలో కూడా ఎలాంటి సమస్య లేకపోవడంతో సైబర్‌నేరగాళ్లు చెప్పే మాటలపై బాధితుడికి పూర్తి నమ్మకం వచ్చింది.
దీంతో బాధితుడు దఫ దపాలుగా రూ. 15.45 లక్షలు స్టాక్స్‌పై పెట్టుబడి పెట్టాడు. స్క్రీన్‌పై లాభాలు కన్పిస్తున్నా వాటిని విత్ డ్రా చేసుకునే అవకాశం లేకపోవడం, వాటిని విత్ డ్రా చేసుకోవాలంటే 20 శాతం కమిషన్ చెల్లించాలంటూ షరతు విధించడంతో బాధితుడు ఇదంతా మోసమని గుర్తించాడు. కేవలం వెయ్యి రూపాయల లాభం చూపించి తన వద్ద నుంచి రూ. 15.44 లక్షలు మోసం చేశారంటూ మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
