Wednesday, February 11, 2026
Homeరంగారెడ్డిBITS Pilani | ప్రపంచ స్థాయి విద్య ప్రయాణంలో బిట్స్ పిలానీ అగ్రగామి

BITS Pilani | ప్రపంచ స్థాయి విద్య ప్రయాణంలో బిట్స్ పిలానీ అగ్రగామి

ప్రపంచ స్థాయి విద్య లక్ష్యంగా భారత్ చేస్తున్న ప్రయాణంలో బిట్స్ పిలానీ అగ్రగామిగా నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. బిట్స్ పిలానీకి చెందిన అంతర్జాతీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం బిట్సా గ్లోబల్ మీట్ బీజీఎమ్ 26 ఆరో ఎడిషన్ శుక్రవారం హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సును తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అధికారికంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎఫ్ ఏ సి, కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ఐఏఎస్, బీజీఎమ్ 2026 ఛైర్‌పర్సన్ అనిత సాకూరు, బిట్స్ గ్రూప్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి రామగోపాల్ రావు, ఇన్వెంటస్ క్యాపిటల్ పార్టనర్స్ ఎంజెల్ ఇన్వెస్టర్ కన్వల్ రేఖి, బీజీఎమ్ 2026 చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మయూర్ పట్నాలా తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి గవర్నర్‌కు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.

- Advertisement -

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ బిట్స్ పిలానీ కేవలం విద్యా ప్రతిభకే పరిమితం కాకుండా తరతరాలుగా నూతన ఆవిష్కరణలు, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, భయంలేని జిజ్ఞాసను పెంపొందిస్తూ వస్తోందని తెలిపారు. నేటి విద్య ఒక కీలక మలుపులో ఉందని, కృత్రిమ మేధస్సు ఎఐ, డేటా సైన్స్, ఆటోమేషన్, డిజిటల్ మార్పులు విద్యా వ్యవస్థను మౌలికంగా మలుస్తున్నాయని అన్నారు. ఎఐ భవిష్యత్తు కల కాదని, ఇప్పటికే విద్య, పాలన, ఆరోగ్య రంగం, పరిశ్రమలు, మానవ జ్ఞానంపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. విద్య లక్ష్యం కేవలం ఉద్యోగాలకే కాకుండా మార్పులకు అనుగుణంగా ఎదగగల సామర్థ్యం, జీవితాంతం నేర్చుకునే దృక్పథాన్ని యువత అలవర్చుకోవాలని సూచించారు.

ఎఐ డేటాను విశ్లేషించగలదని, నిర్ణయాలు తీసుకోగలదని చెప్పారు. అయితే మానవ విచక్షణ, నైతికత, సృజనాత్మకత, కరుణకు అది ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. సమాజ హితానికి సాంకేతికతను దారి చూపగల మానవ విలువలను బలోపేతం చేయడం అత్యవసరమని అన్నారు. ఈ ఆలోచనను బిట్స్ పిలానీ విద్యా స్వయం ప్రతిపత్తి, అనువైన పాఠ్య ప్రణాళికలు, అంతరశాఖీయ అధ్యయనం, ప్రాయోగిక విద్య ద్వారా సాకారం చేస్తోందని శ్లాఘించారు.

తెలంగాణ రాష్ట్ర సాంకేతిక వ్యవస్థతో అనుసంధానమై ఆధునిక పదార్థాలు, బయోటెక్నాలజీ, వాతావరణ పరిష్కారాలు, రోబోటిక్స్, ఎఐ వంటి రంగాల్లో బిట్స్ పిలానీ విశిష్టంగా ఎదుగుతోందని గవర్నర్ తెలిపారు. ఇలాంటి కేంద్రాలు భారత్‌ను కేవలం సాంకేతిక వినియోగదారుడిగా కాకుండా స్థానిక అవసరాలకు అనుగుణమైన ఆవిష్కరణల సృష్టికర్తగా నిలుపుతున్నాయని అన్నారు.

పూర్వ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ బిట్స్ పిలానీ విశిష్ట పూర్వ విద్యార్థుల విజయాలే సంస్థ వారసత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. జాన్ ఎఫ్ కెన్నెడీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విశ్వవిద్యాలయాలకు పూర్వ విద్యార్థుల సంఘాలే ప్రాణవాయువని తెలిపారు. వారి మార్గదర్శనం, దానధర్మాలు, సంబంధాలు సంస్థ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నాయని చెప్పారు. విద్య వినయాన్ని ఇస్తుందని, వినయం అర్హతను కలిగిస్తుందని, అర్హత సంపదను ఇస్తుందని, సంపద ధర్మానికి దారి తీస్తుందని, ధర్మం సుఖాన్ని ఇస్తుందని ఈ సూత్రం దానధర్మాలకు మార్గదర్శకంగా ఉండాలని ఆకాంక్షించారు. యువతకు మార్గదర్శకులుగా నిలిచి సమాజ ఉద్ధరణకు, జాతీయ స్వయం సమృద్ధికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

దాన కిశోర్ మాట్లాడుతూ సాంకేతికత, నాణ్యమైన విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. వర్క్‌ఫోర్స్ డెవలప్‌మెంట్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, నిరంతర అభ్యాసంలో బిట్స్ వంటి సంస్థలు జాతీయ భాగస్వామిగా చేస్తున్న సహకారాన్ని వివరించారు. బీజీఎమ్ 2026 ఛైర్‌పర్సన్ అనిత సాకూరు మాట్లాడుతూ ఈ సదస్సు వివిధ తరాల మధ్య సహకారానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని తెలిపారు. తొలి రోజు ముగింపులో ఇన్‌స్టిట్యూట్ వారసత్వాన్ని ప్రతిబింబించే సంప్రదాయ ఖవ్వాలీ ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు.

ఫోటో రైట్ ఫ్:

  1. పూర్వ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
  2. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు పుష్పగుచ్చం అందజేస్తున్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి
  3. సమ్మేళనంలో పాల్గొన్న బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులు
- Advertisement -
RELATED ARTICLES

Latest News