- తారాస్థాయికి చేరిన లాలూ కుటుంబ కలహాలు..
- బీహార్ రాజకీయాలపైనా ప్రభావం ?
- రోహిణి ఆచార్య రాజకీయ విరమణ ప్రకటన
- ద్రోహులను ప్రజలు క్షమించరు : తేజ్ ప్రతాప్
బీహార్ రాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో కలహాలు తారాస్థాయికి చేరి రాజకీయ వర్గాలకు షాక్ ఇచ్చాయి. ఆర్జేడీ అధినేత కుమార్తె రోహిణి ఆచార్య ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత రాజకీయాల నుంచి విరమిస్తున్నట్లు ప్రకటించడం కొత్త విప్లవంగా మారింది. తనను అవమానించారని, ఇంటి నుంచి బయటకు పంపారని ఆమె ఆరోపిస్తూ, తేజస్వి యాదవ్ సన్నిహితుల ఆదేశాలతోనే ఇలా జరిగినట్లు పేర్కొన్నారు.
తండ్రికి కిడ్నీ దానం చేయటం ప్రచారానికి కారణమైందని, దీంతో తనపై అవమానాలు జరిగాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ ఉదంతంపై తీవ్రంగా స్పందించారు. “నాకు జరిగిన అవమానాన్ని నేను మౌనం గా భరించాను. కానీ మా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని నా సోదరికి అవమానం చేసిన ద్రోహులను బీహార్ ప్రజలు క్షమించరు” అని తెలిపారు. “నాన్నా, ఒక్క మాట చెప్పండి చాలు. ఈ ద్రోహులను ప్రజలే ఖననం చేస్తారు. ఇది పార్టీ పోరాటం కాదు, మన కుటుంబ గౌరవం, ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం పోరాటం” అని తన తండ్రి నుద్దేశించి పేర్కొన్నారు.
ఈ ఘటన తర్వాత రోహిణి ఆచార్య రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించడం, పార్టీ లోపల తీవ్రమైన గందరగోళ పరిస్థితులకు దారి తీస్తోంది ఎన్నికల ఓటమి తర్వాత యాదవ్ కుటుంబంలో ప్రారంభమైన ఈ అంతర్గత కలహాలు పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇతర పార్టీలు ఈ వివాదాన్ని “యాదవ్ ఇంట్లో మహాభారతం”గా పేర్కొంటుంటే మరికొందరు ఇది కుటుంబ అంతర్గత సమస్య అని స్పష్టం చేస్తున్నారు. ఈ కుటుంబ కలహాలు ఆర్జేడీ పార్టీలో మాత్రమే కాక, బీహార్ రాజకీయాల్లో కూడా ఎంతో ప్రభావాన్ని కలిగించవచ్చని అభిప్రాయపడుతున్నారు. పార్టీ నాయకులు ఈ పరిణామాలను నిశితం గా గమనిస్తున్నారు, దీని ప్రభావం వేరే ఎన్నికలలో కూడా ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు.
