అక్టోబర్ 18న (శనివారం) తెలంగాణ బంద్ నిర్వహించాలని బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సంఘం (ఐకాస) పిలుపునిచ్చింది. బీసీ రిజర్వేషన్ల పరిరక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపాయి. ఈ నేపథ్యంలో బంద్‌కు సపోర్ట్‌గా అఖిలపక్ష, బీసీ సంఘాలు అక్టోబర్ 17న (శుక్రవారం) హైదరాబాద్‌లో ముందస్తు సంఘీభావ ర్యాలీ జరిపాయి. బషీర్‌బాగ్ కూడలి నుంచి ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది.

బీసీ ఐకాస చైర్మన్ ఆర్.కృష్ణయ్య, టీజేఎస్ చీఫ్ కోదండరామ్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీసీ ఐకాస వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితర నేతలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరారు.

