Tuesday, February 10, 2026
HomeతెలంగాణWarning | క్షమాపణ చెప్పకుంటే కేటీఆర్ ను అడ్డుకుంటాం

Warning | క్షమాపణ చెప్పకుంటే కేటీఆర్ ను అడ్డుకుంటాం

  • తీవ్రంగా హెచ్చరించిన టిపిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్..

కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమర్యాదగా మాట్లాడటాన్ని టిపిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. పార్టీకి ఎంత నష్టం జరిగినా సరే అని పట్టుబట్టి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని, లేకుంటే ఇవాళ నీ పరిస్థితి, నీ కుటుంబం పరిస్థితి ఏంటని కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు.

హైదరాబాద్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014లో కొత్త రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో మీకు అప్పజెప్పితే… పదేండ్లు కుటుంబంలో అందరూ రాబందుల్లా పీక్కుతిని, లక్షల కోట్లు దోచుకొని, నేడు తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు.

- Advertisement -

బిఆర్ఎస్ పాలనలో కాంట్రాక్టర్లకు బకాయి పడ్డ 60 వేల కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తున్నదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజా నినాదమైన నిధులు, నీళ్లు, నియామకాలను మీరు ఎగ్గొడితే… ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని, వాటితో పాటుగా ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నదని బండి అన్నారు.

కేంద్రంపై ఒత్తిడి తేవడంలో, కృష్ణా జలాలను ఉపయోగించుకోవడంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి అనడంలో తప్పేమీ లేదన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చ పెడితే పారిపోయింది మీరు, మీ బిఆర్ఎస్ పార్టీ నాయకులేనని బండి సుధాకర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి అటెండెన్స్ కోసమే వచ్చారు తప్ప, తెలంగాణ ప్రయోజనాల కోసం కాదన్నారు.

మీ అవకాశవాదం గురించి, దోపిడీ దండాల గురించి స్వయంగా మీ చెల్లెలు కవిత రాష్ట్రం అంతటా చెబుతుంటే, తేలు కుట్టిన దొంగల్లా కుటుంబం అంతా కలుగులో ఎందుకు దాక్కున్నారు? అని బండి సుధాకర్ కేటీఆర్ ను ప్రశ్నించారు. దమ్ముంటే కవిత ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ దొంగలను కలుగుల్లోంచి బయటకు లాగి, దోచుకున్న సొమ్మును ప్రజల ఎదుట కక్కిస్తామన్నారు. అలాగే రాహుల్ గాంధీకి, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని, లేకుంటే కేటీఆర్ ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకుంటాయని బండి సుధాకర్ గౌడ్ హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News