మెరుగైన దిగుబడి.. అధిక ఆదాయం..
ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడి
బోయినపల్లిలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమం
సాగు చేసేందుకు ముందుకు వచ్చిన రైతులు
కరీంనగర్, డిసెంబర్ 24(ఆదాబ్ హైదరాబాద్): ఆయిల్ పామ్ సాగు అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటుందని, నాలుగో ఏడాది నుంచి అధిక దిగుబడి(Yield), ఆదాయం(Income) వస్తుందని రాజన్నసిరిసిల్ల జిల్లా(Rajannasiricilla District) ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ (Incharge Collector Garima Agrawal) తెలిపారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన(Awareness to Farmers) కల్పించేందుకు ఉద్యానవన, వ్యవసాయ, సహకార శాఖల ఆధ్వర్యంలో బోయినపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా ఈ మండలం రైతులు తాము ఆయిల్ పామ్ సాగు చేసిన విధానం, పంట ఉత్పత్తి, ఆదాయం, అంతర పంటల సాగుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఆయిల్ పామ్ మొక్కలను సబ్సిడీపై ఇచ్చారని, అంతర పంటల సాగు, ఎరువులు, మొక్కల యాజమాన్యానికి ఏటా డబ్బులు అందించారని వివరించారు.
అనంతరం ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. మన దేశం ఏటా విదేశాల నుంచి నూనె దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. దిగుమతుల భారం తగ్గించేందుకు, ఆయిల్ పామ్‌లో స్వయంసంవృద్ది సాధించేందుకు ఈ పంట సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. జిల్లాలోనే ఆయిల్ పామ్ నర్సరీ ఉందని, ప్రభుత్వం ఒక్క మొక్కకు రూ.193 సబ్సిడీ ఇస్తుందని, రైతులు ఒక్కో మొక్కకు కేవలం రూ.20 చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను సబ్సిడీపై ఇస్తుందని వివరించారు.
ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ఎక్కువ మంది కూలీలు అవసరం లేదని, నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువని తెలిపారు. నాలుగో ఏడాది నుంచి దిగుబడి మొదలవుతుందని, ప్రస్తుతం ఆయిల్ పామ్ ధర టన్నుకు రూ.19 వేలు ఉందని, పంట ఉత్పత్తిని విక్రయించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఉందని చెప్పారు. మిగితా అన్ని పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ సాగు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని, అటవీ జంతువుల బాధ ఉండదని, ఇతర పర్యావరణ ఇబ్బందులూ రావని తెలిపారు. అంతర పంటలుగా కూరగాయలు, ఇతర పంటలు సాగు చేసుకోవచ్చని, సాగు చేసేందుకు ఆసక్తి ఉన్న రైతులను ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సందర్శనకు తీసుకువెళ్తామని పేర్కొన్నారు
సాగుకు.. ముందుకు..
అవగాహన సదస్సు ముగిసిన తర్వాత పలువురు రైతులు ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. వారు ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలనుకుంటున్నారో ఆ వివరాలను నమోదు చేయించుకున్నారు. ఈ సందర్బంగా రైతులను గరిమ అగ్రవాల్ అభినందించారు. మరింత మంది రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి శరత్ బాబు, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, తహశీల్దార్ నారాయణరెడ్డి, సర్పంచ్ నల్ల మోహన్, రైతులు పాల్గొన్నారు.
