రోడ్డు భద్రతపై నిర్వహించనున్నట్లు డీజీపీ వెల్లడి
డిసెంబర్‌లో 15 రోజుల పాటు నిర్వహణకు చర్యలు
హైదరాబాద్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి రోడ్డు భద్రతపై “అరైవ్ అలైవ్”(Arrive Alive) అనే నూతన అవగాహన కార్యక్రమాన్ని ప్రకటించారు. పోలీస్ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రోడ్డు భద్రత నిపుణులు తదితరులు పాల్గొన్న ఈ సమావేశం శనివారం డిజిపి కార్యాలయంలో నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలలో మరణించే వారి సంఖ్య ప్రతి సంవత్సరం వివిధ సంఘటనలలో హత్యలకు గురయ్యే వారి సంఖ్య కన్నా పదిరెట్లు ఎక్కువగా ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రోడ్డు భద్రతను ప్రజా ప్రాధాన్య అంశంగా తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు “అరైవ్ అలైవ్” రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమం వచ్చే డిసెంబర్ నెలలో 15 రోజులపాటు నిర్వహించనున్నామని డిజిపి తెలిపారు.
నవంబర్ 16 వ తేదిన జరిగే ప్రపంచ రోడ్డు భద్రతా బాధితుల స్మారక దినం సందర్భంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయనున్నామన్నారు. ఈ ప్రచారం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం, నియమాలను కచ్చితంగా పాటించేటట్టు చేయటం, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లను-ముఖ్యంగా Defensive Driving విధానాన్ని ప్రోత్సహించటం, ప్రమాదాలను తగ్గించటం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించుకున్నామని తెలిపారు. Arrive alive కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగ చేపట్టాలని అన్నారు. పోలీసు శాఖ, రవాణా శాఖ, corporate సంస్థలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పరస్పర సమన్వయంతో ముందుకు వెళ్లాల్సి ఉందని పేర్కొన్నారు.
స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తమ ఆలోచనలను సమీకరించి, సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి నవంబర్ 9 లేదా 10న జరిగే తదుపరి సమావేశంలో చర్చించాలని డిజిపి సూచించారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో అమలులో ఉన్న రోడ్డు భద్రతకు సంబంధించి ఉత్తమ విధానాలను పరిశీలించి, తెలంగాణలో అనుసరించదగిన మార్గాలను రూపొందించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పలు సూచనలు చేశారు. శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ జారీకి ముందు డ్రైవర్‌లకు తప్పనిసరిగా డ్రైవింగ్ విద్యా శిక్షణ తరగతులు నిర్వహించాలని, ఆ శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు.
పాఠశాల స్థాయిలోనే రోడ్డు భద్రతా విద్యను పాఠ్యాంశంగా చేర్చటం, ప్రజల్లో అవగాహన పెంచేందుకు రోడ్డు భద్రతా పార్కులను ప్రారంభించాలన్నారు.అదే విధంగా, ప్రతి వాహన డ్రైవర్ ‘సేఫ్టీ కనెక్ట్’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాప్‌ను ఉపయోగించాలన్నారు. ఈ యాప్ డ్రైవింగ్ విధానాన్ని పర్యవేక్షించి, భద్రతా ప్రమాణాలను పాటించేందుకుసహకరిస్తుందన్నారు. సోషల్ మీడియా వేదికల ద్వారా రోడ్డు భద్రతా నియమాలపై విస్తృత ప్రచారం చేయాలని, #ArriveAliveTG వంటి ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని ప్రతినిధులు సూచించారు.
ప్రయోజనకరమైన సూచనలను ఇచ్చిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభినందించారు. రోడ్డు భద్రతపై సంయుక్త కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయటంలో పోలీస్ శాఖ సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యం, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన మరియు నియమాల అమలు , defensive driving — ఈ అంశాల సమన్వయమే రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో కీలకమని డిజిపి స్పష్టం చేశారు.
సమావేశంలో శాంతి భద్రతల అడిషనల్ డిజిపి మహేష్ ఎం.భగవత్, ఎడిజిపి (మల్టిజోన్-II) దేవేంద్ర సింగ్ చౌహాన్, ఐజిపి లు (మల్టిజోన్-I) ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, (ప్రోవిజనింగ్ & లాజిస్టిక్స్) డా. ఎం.రమేశ్, ఐజిపి (రైల్వే & రోడ్డు భద్రత) కె.రమేశ్ నాయుడు, జాయింట్ సీపీ (ట్రాఫిక్, హైదరాబాద్ సిటీ) డి.జోయెల్ డేవిస్, తదితర అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థల తరఫున తన్మయి దీక్షిత్ (ఫౌండర్, సేఫ్టీ కనెక్ట్), నరేశ్ రాఘవన్ (టాప్ డ్రైవర్), మాల్కమ్ వోల్ఫ్ (రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్), లోకేంద్ర సింగ్ (ఎచ్‌సీఎస్సీ వాలంటీర్), అనిల్ సూర్య (ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్), వినయ వంగాల (సివిల్ యాక్టివిస్ట్), వినోద్ కనుముల (రోడ్డు భద్రత నిపుణుడు) తదితరులు పాల్గొన్నారు.
