- “భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్, ఓం నమశ్శివాయ” ఉచ్చరణలతో “ఆలయంగా మారిన సుదర్శన్ 35 ఎంఎం థియేటర్”
- విశ్వహిందూ రక్ష పరిషత్ మహిళా అధ్యక్షురాలు యమునా పాటక్ ప్రోత్సాహంతో సినిమా వీక్షించిన కళాశాల విద్యార్థులు.
- ఆర్టీసీ క్రాస్ రోడ్ థియేటర్లో విద్యార్థులతో కలిసి సినిమా చూసి సందడి చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను.
- హెచ్ఎంటీవీ ఛానల్ లో “జాగోరే జాగో” కార్యక్రమంతో ఆలయాల పరిరక్షణపై చైతన్యం తీసుకువచ్చిన యమునా పాటక్.
- దేశం మరియు ధర్మం రక్షణ బాధ్యతను గుర్తిచేసిన దర్శకుడు బోయపాటి శ్రీను
- “అఖండ భారత దేశము” వైపు పడుతున్న అడుగులు.
ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో శుక్రవారం సాయంత్రం ప్రేక్షకులతో మరియు విద్యార్థులతో కలిసి సినిమా చూసిన దర్శకుడు బోయపాటి శ్రీను మరియు విశ్వహిందూ రక్షా పరిషత్ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్. సినిమా అనంతరం వీక్షకులందరూ వీరిద్దరితో ఎంతో మమేకమై తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. జాగోరే జాగో కార్యక్రమంతో సంవత్సరం పైగా ఆలయాల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న యమునా పాటక్ ని, తమ ఆధ్యాత్మిక ఉద్యమాన్ని అలానే కొనసాగించాలని ప్రేక్షకులు ఆమెని ఉత్సాహపరిచారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ల వరకు బోయపాటితో అందరూ ఆత్మీయ కరచాలనం చేసి, తమ కుటుంబ సభ్యులుగా తనతో మమేకమయ్యారు. “అఖండ – 3” ఎప్పుడు అని ఓ చిన్నారి అడిగిన ప్రశ్న అక్కడ నవ్వులు కురిపించాయి.
ఇది అన్ని తరాల వారికి సంబంధించిన సినిమా: దర్శకుడు బోయపాటి శ్రీను.
“ఆధ్యాత్మికత అనేటిది భారతదేశము యొక్క ఆత్మ, అదే ఈ అఖండ సినిమాకి ప్రేరణ, ఇది ఏ ఒక్క తరానికో పరిమితమైన చిత్రం కాదని, ఇది అన్ని తరాల వారికి ముఖ్యంగా నవ తరానికి సంబంధించిన చిత్రమని” బోయపాటి అన్నారు. మన దేశం మరియు ధర్మం యొక్క రక్షణను పరిత్యజిస్తే మనెవ్వరికీ మనుగడ ఉండదని, కావున వాటిని పటిష్టంగా పరిరక్షించడంతోపాటు భావితరాలకు అందజేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయకూడదని బోయపాటి చెప్పుకొచ్చారు. ప్రేక్షకులతో ప్రత్యక్షంగా సినిమా చూసి, వారి స్పందన కనులారా చూడడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆయన తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.
ఇక మన తాండవమే తరువాయి: యమునా పాటక్, విశ్వహిందూ రక్షా పరిషత్ మహిళా అధ్యక్షురాలు.
సినిమా బృందం వారు వారి పని చేశారని, ఇక ఆ సినిమాని జనాల్లోకి మరింత దీర్ఘంగా తీసుకువెళ్లి దేశం మరియు ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలని యమునా పాఠక్ పిలుపునిచ్చారు. ఎన్నో గొప్ప విషయాల కలయిక ఈ అఖండ తాండవ చిత్రం అని అన్నారు. నిద్రపోతున్న హిందువుని తట్టి లేపే చిత్రమని, భావి భారత తరానికి తన బాధ్యతను గుర్తు చేసిన చిత్రమని ఆమె అన్నారు. జాగోరే జాగో లాంటి బుల్లితెర శీర్షికలతో ఎన్నో ఆలయాల పరిరక్షణ జరిగిందని, సంవత్సరం పొడుగునా జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక పోరాటంలో చవిచూసిన ఎన్నో అనుభవాలు ఈ చిత్రంలో కనిపించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.
ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు అంతకుమించి సృష్టింపబడిన ఒక శక్తి అని, ఆశక్తిని నిరంతరం ప్రవహింప చేయడం మన బాధ్యత అని ఉద్వేగంగా మాట్లాడారు. సినిమాలో చెప్పిన విధంగా మన భారతీయుల డిఎన్ఏ లోనే ధర్మ యుద్ధం చేసే తత్వం ఉందని, ఆ తత్వాన్ని ఎప్పుడూ జాగృతావస్థ స్థితిలోనే ఉంచుతూ మనల్ని, మన భావితరాలని, మన దేశం-ధర్మం మరియు ప్రకృతిని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు. అందులో భాగంగా, ఈ సినిమాని అందరూ చూసే విధంగా మనము ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
