- సంకేతాలిస్తున్న ఆయా కంపెనీలు..
- తమ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయన్న బ్లూ స్టార్..
ఈ వేసవి కాలంలో ఠారెత్తించే ఎండలకు తగ్గట్టుగానే.. ఎయిర్ కండీషనర్ల ధరలూ ఎగిసిపడటం ఖాయంగానే కనిపిస్తున్నది. రాబోయే సమ్మర్ సీజన్‌లో ఏసీల రేట్లు పెరుగుతాయని ఆయా సంస్థలు ఇప్పట్నుంచే సంకేతాలు ఇస్తున్నాయి మరి. ఈ క్రమంలోనే ఏసీల తయారీ దిగ్గజం బ్లూ స్టార్ ఈ త్రైమాసికంలో తమ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని స్పష్టం చేసింది. తాజాగా ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బీ త్యాగరాజన్ ఓ ప్రము ఖ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడారు..
ఈసారి ధరల పెంపు తప్పేటట్టు లేదు అన్నారు. పెరిగిన ఉత్పాదక వ్యయం, ఎనర్జీ-ఎఫీషియన్సీ లేబులింగ్‌లో మార్పులు, ఎగిసిన ఎక్సేంజ్ రేట్లు.. ఏసీల ధరలకు రెక్కల్ని తొడుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సమ్మర్‌లో ఆయా బ్రాండ్ ఏసీల ధరలు 10 నుంచి 15 శాతం పెరుగవచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. దీన్ని బ్లూ స్టార్ ఎండీ త్యాగరాజన్ ధ్రువీకరించారు.
పన్నులు, వడ్డీ చెల్లింపులకు ముందు ఆర్జించే ఆదాయాల్లో ఇండస్ట్రీ వాటా 8-10 శాతంగానే ఉంటున్నదని, కాబట్టి తయారీ ఖర్చుల భారాన్ని భరించే పరిస్థితుల్లో కంపెనీలు లేవని ఆయన అన్నారు. రాగి ధరలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయాయని, ఇతర కీలక ఉత్పత్తుల రేట్లు కూడా పెరిగాయని గుర్తుచేశారు. అందుకే కొనుగోలుదారులపై ఈ భారాన్ని మోపక తప్పట్లేదని వ్యాఖ్యానించారు.
