- ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది..
- వెల్లడించిన భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి..
టీ20 వరల్డ్‌కప్‌లో ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడే అవకాశాలు ఉన్నట్లు భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తెలిపాడు. కడుపు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న అభిషేక్.. గురువారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడని విషయం తెలిసిందే. అయితే అభిషేక్ శర్మ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉన్నట్లు వరుణ్ చెప్పాడు. ఆరోగ్యం క్షీణించడం వల్ల రెండు రోజుల పాటు అభిషేక్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. అభిషేక్‌తో మాట్లాడానని, అతను బాగానే ఉన్నాడని, ఇవాళ కొంత ప్రాక్టీస్ చేశాడని, సిద్ధం అవుతున్నట్లు అతను చెప్పాడని వరుణ్ చక్రవర్తి పేర్కొన్నాడు.
నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి రెండు ఓవర్లు వేసి 7 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఆ మ్యాచ్ టాస్ వేసిన సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు అభిషేక్ శర్మ మిస్సయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. అభిషేక్ శర్మ గైర్హాజరీలో నమీబియాతో మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఓపెనింగ్ బాధ్యతలు చేపట్టాడు.
వరల్డ్‌కప్‌లో ఇండియా వరుసగా తన రెండో మ్యాచ్ నెగ్గింది. నమీబియాపై 93 రన్స్ తేడాతో నెగ్గింది. ఒకవేళ కొలంబోలో జరిగే ప్రాక్టీస్ సెషన్‌లో అభిషేక్ పాల్గొంటే అతను పాక్‌తో మ్యాచ్‌కు ఆడేది లేనిది తేలే అవకాశం ఉంటుంది. నెట్స్‌లో చాలా సమయం అతను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. దాని ఆధారంగా ఇండోపాక్ మ్యాచ్‌పై క్లారిటీ వస్తుంది.
