భారతదేశ మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం(Abdul Kalam) గారి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాoచందర్ రావు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకోవడం మన అందరి బాధ్యత. డాక్టర్ కలాం ఒక గొప్ప శాస్త్రవేత్తగా, డిఫెన్స్ రంగంలో, అంతరిక్ష పరిశోధనల్లో, శాస్త్రీయ అభివృద్ధిలో దేశానికి మరుపురాని సేవలు చేశారు. ఈ దేశం వాటిని ఎప్పటికీ మర్చిపోదు.
ఒక సామాన్య వ్యక్తిగా, పుస్తకాలు రాసి, పిల్లలలో జ్ఞానాన్ని, దేశభక్తిని పెంపొందించేలా ప్రేరణనిచ్చారని అన్నారు. “ఇగ్నైటింగ్ మైండ్స్” లాంటి పుస్తకాల ద్వారా చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపారు. “వారి ఆలోచనలు, ఆశయాలు యువతను స్ఫూర్తిపరచేవిగా ఉన్నాయి. వారి మాటలు ‘నేను ముందు భారతీయుడు, తర్వాతే నా మతం’ అనే భావన దేశభక్తికి ప్రతిరూపంగా నిలిచాయి.
“ప్రస్తుతం మనం చూస్తున్న డిఫెన్స్ రంగంలో స్వదేశీ ఉత్పత్తుల విజయవంతం వెనుక కలాం గారి ఆలోచనలే మూలమై ఉన్నాయని గుర్తించాలి. అప్పట్లో లక్షల కోట్లు ఖర్చు చేసి ఇతర దేశాల నుండి ఆయుధాలు దిగుమతి చేసుకుంటే, నేడు నరేంద్ర మోదీ గారి పాలనలో భారత్ స్వయంగా డిఫెన్స్ ఉత్పత్తులు చేస్తోంది. దేశీయ తయారీ ద్వారా దేశానికి వేల కోట్ల రూపాయల ఆదా జరుగుతోంది.
అంతేకాక, మనం ఇతర దేశాలకు కూడా ఎగుమతులు చేయగలగుతున్న స్థితికి చేరుకున్నాం. కలాం సేవలను గుర్తు చేసుకుంటూ, వారికి నివాళులర్పిస్తూ, వారి జీవితం, తత్త్వాలను ముందుకు తీసుకెళ్లాలనే పిలుపునిచ్చేందుకు బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ వేడుకలు నిర్వహించామన్నారు. ప్రతి కార్యకర్త కూడా ఆ మార్గంలో ముందడుగు వేయాలనే ఆశిస్తున్నట్లు తెలిపారు.
