- తిరువన్నామలైలో ఆధ్యాత్మిక శోభ..Thirukarthigai Deepotsavam
- ఈనెల 15న సాంప్రదాయంగా మొదలైన పండుగ..
తమిళనాడులోని ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలో కొలువైన అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో తిరుకార్తిగై దీపోత్సవాలు (Thirukarthigai Deepotsavam) వైభవంగా ప్రారంభమయ్యాయి. 2026 నవంబర్ 15న ఆలయంలో సంప్రదాయబద్ధంగా ధ్వజారోహణం నిర్వహించడంతో పది రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. తొలి రోజు వినాయకుడు, చండికేశ్వర స్వామివారు వెండి వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్నారు. అగ్ని రూపంలో దర్శనమిచ్చే అరుణాచలేశ్వరుడు హిందూ ధర్మంలో తిరువణ్ణామలై క్షేత్రానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. పంచభూత క్షేత్రాల్లో ఇది అగ్ని లింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పరమశివుడు అగ్ని స్వరూపంలో కొలువై ఉన్నాడని భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నిర్వహించే తిరుకార్తిగై దీపోత్సవాన్ని దర్శించుకోవడానికి దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు.
ఈ ఉత్సవాలకు ముందుగా నవంబర్ 12న క్షేత్రపాలకురాలైన దుర్గాదేవి వీధియులా నిర్వహించారు. నవంబర్ 13న పిడారి అమ్మవారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నవంబర్ 14న సంబంధ వినాయకుడికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, పూజలు నిర్వహించారు. అనంతరం వినాయకుడు వెండి మూషిక వాహనంపై, చండికేశ్వర స్వామి వెండి వృషభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అనుగ్రహం అందించారు. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో చివరి రోజైన నవంబర్ 24 అత్యంత విశిష్టమైనది. ఆ రోజు తెల్లవారుజామున సుమారు 4 గంటలకు ఆలయ గర్భగుడిలో భరణి దీపాన్ని వెలిగిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు 2,668 అడుగుల ఎత్తైన అరుణాచల కొండపై మహా దీపాన్ని ప్రజ్వలింపజేస్తారు.
కొండ శిఖరంపై వెలిగించే ఈ మహా జ్యోతిని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తిరువణ్ణామలైకి చేరుకుంటారు. మహా దీపం వెలిగిన సమయంలో అరుణాచల హరా.. శివ శివ అంటూ భక్తులు చేసే నామస్మరణతో ఆ క్షేత్రమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
– Advertisement –
