- మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం..Road accidents
- బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలు..Road accidents
- అప్పన్నపేట వద్ద భర్త మృతి…భార్యకు తీవ్ర గాయాలు
- మృతదేహాన్ని ట్రాక్టర్ లోకి ఎక్కించి మానవత్వం చాటిన గరిడేపల్లి ఎస్ ఐ శ్రీకాంత్ గౌడ్..
- హుజూర్ నగర్ పట్టణం బైపాస్‌పై మరో ప్రమాదం…బైకర్ దుర్మరణం..
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో ఆదివారం జాతీయ రహదారి 167 పై జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు (Road accidents) బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. గరిడేపల్లి మండలం అప్పన్నపేట సమీపంలో మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో భర్త షేక్ నజీర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య హుస్సేన్ బీ తీవ్రంగా గాయపడింది. మరోవైపు హుజూర్నగర్ పట్టణంలోని దీక్షిత్నగర్ బైపాస్ రోడ్డుపై లారీ ఢీకొని పంగా నాగరాజు మృతి చెందగా, ఎల్లవుల సురేందర్ గాయపడ్డాడు. ఒకే రోజు రెండు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది.
మద్యం మత్తులో లారీ నడిపి…దంపతుల బైక్‌ను ఢీకొట్టిRoad accidents
గరిడేపల్లి ఎస్ఐ బి.శ్రీకాంత్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం హుజూర్నగర్ పట్టణంలోని పీర్ల కొట్టం బజార్‌కు చెందిన షేక్ నజీర్ ఆయన భార్య హుస్సేన్ బీ వంట మాస్టర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.ఆదివారం దామరచర్ల మండలం కల్లేపల్లిలో ఓ కార్యక్రమానికి వంట చేసేందుకు వెళ్లిన దంపతులు పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామ సమీపానికి చేరుకోగానే హుజూర్నగర్ నుంచి గరిడేపల్లి వైపు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ వారి బైక్‌ను ఢీకొట్టింది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండి నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో షేక్ నజీర్ అక్కడికక్కడే మృతి చెందగా ఆయన భార్య హుస్సేన్ బీ తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. మృతుడి తల్లి లాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

దీక్షిత్నగర్ బైపాస్‌పై మరో ప్రమాదం…బైకర్ మృతి
హుజూర్నగర్ పట్టణంలోని దీక్షిత్నగర్ లో ఆర్చిడ్ పాఠశాలకు సమీపంలో బైపాస్ రోడ్డుపై ఆదివారం సాయంత్రం సమయంలో మరో ఘోర ప్రమాదం జరిగింది.పట్టణ ఎస్సై చలికంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన పంగా నాగరాజు (40),ఎల్లవుల సురేందర్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై బైపాస్ రోడ్డును దాటుతున్నారు. అదే సమయంలో హుజూర్నగర్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ ఇలపోగు డేవిడ్ (39) అతి వేగంగా, నిర్లక్ష్యంతో వాహనాన్ని నడుపుతూ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక కూర్చున్న ఎల్లవుల సురేందర్ గాయపడ్డాడు. ఈ ఘటనపై హుజూర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్వయంగా మృతదేహాన్ని తరలించి మానవత్వం చాటుకున్న ఎస్ఐ శ్రీకాంత్ గౌడ
అప్పన్నపేట సమీపంలో జరిగిన ప్రమాద ఘటనలో షేక్ నజీర్ మృతదేహం ఛిద్రం కావడంతో ఘటనాస్థలిలో హృదయవిదారక పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో విధుల్లో ఉన్న గరిడేపల్లి ఎస్ఐ బి.శ్రీకాంత్ గౌడ్ మానవత్వంతో స్పందించారు. మృతదేహాన్ని గ్రామపంచాయతీ ట్రాక్టర్లోకి ఎక్కించడంలో స్వయంగా పాల్గొని అక్కడి పరిస్థితులను చక్కదిద్దడంలో చొరవ చూపారు.బాధ్యతాయుతంగా వ్యవహరించిన ఎస్ఐ తీరుపై స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేశారు.ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందడం, మరో ఇద్దరు గాయపడటంతో హుజూర్నగర్ పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
