Homeఆదాబ్ ప్రత్యేకంMankhal Land Scam | ఖజానాకు కన్నం.. కేటుగాళ్ల పన్నం!

Mankhal Land Scam | ఖజానాకు కన్నం.. కేటుగాళ్ల పన్నం!

మంఖాల్ భూ దందాలో.. కరిగిపోయిన రూ.1,000 కోట్ల ప్రజాధనం

  • మహేశ్వరం మండలం మంఖాల్‌లో భూముల వివాదం
  • 1954-55 పహాణీలో పట్టాదారుగా ‘సర్కార’ నమోదు
  • 608లో 2 ఎకరాల డంపింగ్ యార్డ్ కేటాయింపు
  • 35 ఎకరాలు.. 39 సబ్‌డివిజన్లుగా భూమి విభజన
  • నాటి రెవెన్యూ అధికారుల పాత్రపై విచారణకు డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ఖజానాకు కాపలా కాయాల్సిన అధికారులే.. అక్రమార్కులతో చేతులు కలిపితే వ్యవస్థలు ఎంతలా భ్రష్టుపడతాయో మహేశ్వరం మండలం మంఖాల్ భూకుంభకోణమే(Mankhal Land Scam) ప్రత్యక్ష నిదర్శనం.

- Advertisement -

ప్రజలు చెమటోడ్చి కట్టిన పన్నులతో లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ.. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వ ఆస్తులకే కన్నం వేశారా? ఖజానాకు కాపలా కాయాల్సిన అధికారులే కాజేసేవారితో చేతులు కలిపితే వ్యవస్థలు ఎంతలా భ్రష్టుపడతాయో మహేశ్వరం మండలం మంఖాల్ భూకుంభకోణమే(Mankhal Land Scam) ప్రత్యక్ష నిదర్శనం. అప్పట్లో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అమోయ్ కుమార్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ నవత, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ వంటి బాధ్యతాయుతమైన అధికారులే అక్రమార్కులు విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి, సుమారు రూ. 1,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం క్షమించరాని నేరం. ప్రజాధనంతో బతుకుతూ.. ప్రజాసంపదను కొల్లగొట్టిన ఈ కేటుగాళ్లపై కేవలం శాఖాపరమైన చర్యలే కాదు, కఠినమైన క్రిమినల్ కేసులు పెట్టి కటకటాల వెనక్కి నెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది!

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, మంఖాల్(Mankhal Land Scam) గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 608, 609 మరియు 610 భూములకు సంబంధించి ‘ఆదాబ్ హైదరాబాద’ లేవనెత్తిన ప్రశ్నలు, బయటపెట్టిన వాస్తవాలు అత్యంత సంచలనంగా మారాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇవి పూర్తిగా ప్రభుత్వ భూములేననడానికి తిరుగులేని ఆధారాలున్నాయి. మరి చారిత్రక రికార్డుల్లో ‘సర్కార’ భూమిగా ఉన్న ఈ ప్రాంతం, ప్రైవేట్ పట్టా భూమిగా ఎలా రూపాంతరం చెందిందనే దానిపై క్షుణ్ణంగా పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తాయి..

  1. ప్రభుత్వ భూమి అనడానికి ఉన్న బలమైన ఆధారాలు:

1954-55 పహాణి రికార్డులు: ఈ సర్వే నంబర్ల (608, 609, 610) తాలూకు నాటి పహాణి రికార్డులలో పట్టాదారు కాలమ్‌లో స్పష్టంగా ‘సర్కార’ అని నమోదై ఉంది. అంటే మూలాల ప్రకారం ఇది వంద శాతం ప్రభుత్వ భూమి.

డంపింగ్ యార్డ్ కేటాయింపు: సర్వే నంబర్ 608 పరిధిలోని 2.00 ఎకరాల భూమిని అప్పట్లో ప్రభుత్వం తుక్కుగూడ మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిమిత్తం ప్రొసీడింగ్స్ నెం. దీ/1696/2005 ద్వారా సేకరించిన ప్రభుత్వ భూమిని అధికారికంగా కేటాయించింది.

ఇది ప్రభుత్వ భూమి కాకపోతే మున్సిపాలిటీకి ఈ కేటాయింపు ఎలా జరుగుతుంది?

అధికారిక తనిఖీ నిర్ధారణ: ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచఎంసీ) శంషాబాద్ సర్కిల్-18 డిప్యూటీ కమిషనర్ మరియు రెవెన్యూ అధికారులు నిర్వహించిన సంయుక్త క్షేత్రస్థాయి పరిశీలన (జాయింట్ ఇన్‌స్పెక్షన్) నివేదికలోనూ, రికార్డుల ప్రకారం ఇది ప్రభుత్వ భూమిగానే ఉన్నట్లు స్పష్టం చేశారు.

Mankhal Government Land Scam Worth Rs 1000 Crore00
  1. సర్కార్ భూమి.. ప్రైవేట్ పట్టాగా ఎలా మారింది?

కాగితాలపై ‘సర్కార’ భూమిగా ఉన్న ఈ విశాలమైన 35 ఎకరాల పైచిలుకు భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడానికి రెవెన్యూ వ్యవస్థలోని లొసుగులు, కొందరి అధికారుల అక్రమ ప్రమేయమే కారణం. ఇదంతా కింది పద్ధతుల్లో పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది.

సెత్వార్ రికార్డుల గైర్హాజరు – అదృశ్యమైన మూలాలు: జిల్లా సర్వే అధికారి రికార్డుల ప్రకారం ఈ సర్వే నంబర్లకు సంబంధించిన మూల ‘సెత్వార’ రికార్డులు అసలు అందుబాటులోనే లేవు. మూల రికార్డులు లేనప్పుడు వాటిని ఆధారం చేసుకొని ప్రైవేట్ హక్కులు కల్పించడం నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికీ, దళారులు మరియు అధికారుల కుమ్మక్కుతో రికార్డులను తారుమారు చేయడమే కాకుండా, బోగస్ సేత్వాలను కూడా సృష్టించినట్లు ‘ఆదాబ్ హైదరాబాద’ పక్కా ఆధారాలు సేకరించింది.

అధికారుల పాత్ర & బినామీ లావాదేవీలు: అప్పట్లో పనిచేసిన కొందరు రెవెన్యూ ఉన్నతాధికారులు (నాటి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అప్పటి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ నవత, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ తదితరులు) తమ అధికారిక హోదాను అడ్డంపెట్టుకుని, ఈ ప్రభుత్వ భూమిని బినామీల పేరిట ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేలా చక్రం తిప్పారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

39 సబ్-డివిజన్లు & మ్యూటేషన్లు: ఈ భూమిని అత్యంత వ్యూహాత్మకంగా 39 చిన్న చిన్న భాగాలుగా (సబ్-డివిజన్లు) విభజించారు. పలువురు ప్రైవేట్ వ్యక్తులు, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు (ఉదాహరణకు ‘వీకేఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స’ తదితరులు) తమ పేరిట మ్యూటేషన్లు చేయించుకోవడంతో పాటు, నాలా మార్పిడి (వ్యవసాయేతర భూమిగా మార్పిడి) మరియు రిజిస్ట్రేషన్లు కూడా అక్రమంగా పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

Mankhal Government Land Scam Worth Rs 1000 Crore0a

తక్షణ చర్యల అవసరం:

ఒకవైపు ప్రభుత్వ రికార్డులు, మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ కేటాయింపులు ఇవి ప్రభుత్వ భూములని స్పష్టం చేస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో ఇవి ప్రైవేట్ పట్టాలుగా మారిపోవడం వెనుక పెద్ద ఎత్తున కోట్ల రూపాయల చేతులు మారినట్లు స్పష్టమవుతోంది.
ప్రభుత్వ ఆస్తులను, ప్రజాసంపదను కాపాడాల్సిన బాధ్యత కలిగిన యంత్రాగం ఇప్పటికైనా స్పందించి:

అక్రమ సబ్ – డివిజన్లు, మ్యూటేషన్లు మరియు నాలా ప్రొసీడింగ్స్‌ను వెంటనే రద్దు చేయాలి.

ఈ భారీ భూ కుంభకోణానికి బాధ్యులైన నాటి అధికారులపై, అక్రమంగా లబ్ది పొందిన వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కబ్జాలో ఉన్న సుమారు రూ. 1,000 కోట్ల విలువైన ఈ భూమిని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రజలు మరియు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News