- మాదకద్రవ్యాల కట్టడికి విద్యాసంస్థల్లో ప్రతిజ్ఞ చేయించాలి
హైదరాబాద్: 2029 నాటికి తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా(Telangana Governor)(Shiv Pratap Shukla
) పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, తమ కలలను సాకారం చేసుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల నియంత్రణకు పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశ సమయంలోనే విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు.







ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో బుధవారం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఓయూ ఎన్‌ఎస్‌ఎస్ సెల్ సంయుక్తంగా నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్’, ‘నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్–2047’ అవగాహన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారిని దూరం పెట్టకుండా, వైద్యం, కౌన్సెలింగ్‌తో సాధారణ జీవితంలోకి తీసుకురావాలని సూచించారు.



నవంబరు 14 నుంచి జనవరి 12 వరకు 60 రోజుల పాటు విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యువతలో చైతన్యం కల్పించేందుకు సదస్సులు, ర్యాలీలు, కౌన్సెలింగ్ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించి, అవగాహన ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
















