Homeహైదరాబాద్‌Mansoorabad | మన్సూరాబాద్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దందా..

Mansoorabad | మన్సూరాబాద్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దందా..

  • నిరుపేదల జీవితాలతో ఆడుకుంటున్న దళారులు..!
  • రూ. 1.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు అక్రమ వసూళ్లు..!
  • స్థానికులను పక్కన బెట్టి ఇతర ప్రాంతాల వారికి పట్టాలు..
  • హౌసింగ్ పీడీ చెంప్లా నాయక్, దళారీ సాగర్ గంగయ్యపై తీవ్ర ఆరోపణలు..
  • న్యాయం చేయాలని కోరుతున్న అర్హులైన పేదలు..
  • ప్రభుత్వం పట్టించుకుని విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న ఎరుకల సంఘం..

పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ప్రభుత్వ ఆశయానికి కొందరు దళారులు, స్వార్థపరులైన అధికారులు తూట్లు పొడుస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్‌లోని(Mansoorabad) ‘ఏరుకుల నాంచారమ్మ నగర్’లో నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రస్తుతం అంగడి సరుకులా మారా యి. అర్హులైన స్థానికులను విస్మరించి, డబ్బుల కోసం బేరసారాలు సాగిస్తున్న దందాపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రూ. లక్షల్లో వసూళ్ల పర్వం :

- Advertisement -

మన్సూరాబాద్‌లో 1.34 ఎకరాల విస్తీర్ణంలో రెండు బ్లాకులుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. ఇందులో ‘బి’ బ్లాక్‌లో ఖాళీగా ఉన్న 84 ప్లాట్లను ఆసరాగా చేసుకుని, ‘ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి’ ఉపాధ్యక్షుడిగా చెప్పుకుంటున్న జె. సాగర్ గంగయ్య అనే వ్యక్తి దందాకు తెరలేపాడు. ఇళ్లు ఇప్పిస్తామంటూ అమాయక నిరుపేదల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు అందినకాడికి వసూలు చేస్తున్నారు. సగం డబ్బులు ఇచ్చిన వారిని సైతం మిగతా మొత్తం కోసం వేధింపులకు గురిచేస్తున్నట్లు బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మరోవైపు కుంట్లూరులో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూపిస్తామంటూ కూడా మరికొందరి వద్ద వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

అర్హులను పక్కనబెట్టి స్థానికేతరులకు కేటాయింపు.. :

గత 20 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్న నిజమైన పేదలకు ఇళ్లు దక్కకపోగా, పొరుగు జిల్లాలు, ఇతర ప్రాంతాలకు చెందిన వారికి ఇళ్ల పట్టాలు ఎలా దక్కాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. “డబ్బులు ఇవ్వనిందుకే మీకు ఇళ్లు రాలేదు, డబ్బులు ఇచ్చిన వారికే వచ్చాయి” అంటూ దళారులు బహిరంగంగా దబాయిస్తుండడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మోసాన్ని భరించలేక ఇటీవల ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, స్థానికులు ఆమెను అడ్డుకుని ప్రాణాలు కాపాడారు. అంతేకాకుండా, ఇక్కడ ఇళ్ల పట్టాలు పొందిన కొందరు వ్యక్తులు వాటిని రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.

హౌసింగ్ పీడీ పాత్రపై తీవ్ర అనుమానాలు :

ఈ అక్రమ దందాల వెనుక హౌసింగ్ పీడీ చెంప్లా నాయక్ పాత్ర ఉందంటూ తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ అధికారుల జోక్యం లేకుండా పీడీ చెంప్లా నాయక్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ, దళారి సాగర్ గంగయ్యకు కొమ్ముకాస్తున్నారని ఎరుకల సంఘం నాయకులు మండిపడుతున్నారు. గతంలో బాధితులు ప్రజావాణి ద్వారా కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసినా, అధికారులు నామమాత్రపు విచారణ జరిపారే తప్ప ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది.

వెంటనే సమగ్ర విచారణ జరిపి, అర్హులైన స్థానిక నిరుపేదలకు మాత్రమే ఇళ్ల పట్టాలు అందజేయాలి. అనర్హులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ పట్టాలను తక్షణమే రద్దు చేయాలి. నిరుపేదల జీవితాలతో చెలగాటమాడుతున్న దళారి సాగర్ గంగయ్యతో పాటు, సహకరిస్తున్న హౌసింగ్ పీడీ చెంప్లా నాయక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అర్హులైన బాధితులు డిమాండ్ చేస్తున్నారు..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News