- చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం.. మెదక్లో ప్రజాగ్రహం
- సీసీ కెమెరాల నిఘా, భద్రతపై రజక సంఘం ఆగ్రహం
- బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్
- నిరసనకారులకు బిఆర్ఎస్ నాయకుల మద్దతు
మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం కావడం తీవ్ర కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనపై రజక సంఘం నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనాస్థలానికి చేరుకుని నిరసన(Protest) తెలిపారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు సంయమనం పాటించాలని సూచించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులను గుర్తిస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు సమాచారం.
సీసీ కెమెరాల నిఘా, భద్రతపై రజక సంఘం ఆగ్రహం
వీరనారి విగ్రహం వద్ద సీసీ కెమెరాల నిఘా, భద్రతా ఏర్పాట్లపై రజక సంఘం నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కెమెరాలు సరైన దిశలో లేకపోవడం, ఘటనను స్పష్టంగా గుర్తించేలా లేకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తరుణంలో, ఆమె విగ్రహానికి తగిన రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం ఎందుకని నిలదీశారు.

నిందితులెవరు.. చర్యలెప్పుడు?
ఈ ఘటనపై రజక సంఘం నాయకులు మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులు సైతం ఘటనాస్థలానికి చేరుకుని నిరసనకారులకు మద్దతు(Protest) తెలిపారు. వీరనారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు ఎవరు? ఈ ఘటన వెనుక కారణాలేమిటి? నిందితులను పోలీసులు ఎప్పటిలోగా గుర్తిస్తారు? అనే ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఘటనకు బాధ్యులైన వారిని త్వరితగతిన గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నిరసనకారులకు బిఆర్ఎస్ నాయకుల మద్దతు, ఖండన
తెలంగాణ పోరాట యోధురాలు ఐలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనపై మెదక్ బిఆర్ఎస్ నాయకులు స్పందించారు. నిరసనకారులకు మద్దతు తెలిపి విగ్రహ ధ్వంసం ఘటనను ఖండించారు. విగ్రహ ధ్వంసం హేయమైన చర్య అని, బాధ్యులను త్వరలోనే గుర్తించి శిక్షించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మెదక్ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
