- రబీలో వరి సాగుకు దూరంగా ఉండాలి..
- ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలి
- నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలి..
- కడ్తాల్ మండల రైతులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ మంత్రి సూచనలు
కడ్తాల్: ఎల్‌నినో పరిస్థితుల(El Niño Alert)నేపథ్యంలో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.ప్రస్తుతం సాగులో ఉన్న పంటలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,రబీ సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపికలో మార్పులు చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు.సోమవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో వ్యవసాయ అధికారి కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతునేస్తం’ కార్యక్రమంలో భాగంగా రైతువేదికల ద్వారా రైతులకు వాతావరణ పరిస్థితులు,పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
రబీలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో((El Niño Alert)) వాతావరణ పరిస్థితులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ప్రస్తుత పంటలను కాపాడుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.రబీ సీజన్‌లో వరి పంట సాగుకు దూరంగా ఉండాలని సూచించారు.తక్కువ కాలంలో,అంటే ఒకటి నుంచి రెండు నెలల్లో చేతికొచ్చే కూరగాయలు,ఆకుకూరలు,మినుములు,పెసలు,పశుగ్రాస పంటలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని తెలిపారు.అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటే సాగునీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు.
నీరు,విద్యుత్ పొదుపే కీలకం
భూగర్భ జలమట్టాలు రోజురోజుకూ తగ్గిపోతున్న నేపథ్యంలో రైతులు నీటిని,విద్యుత్‌ను అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.అవసరానికి మించి నీటిని వినియోగించకుండా,అందుబాటులో ఉన్న నీటి వనరులను ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకోవాలని తెలిపారు.ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ వ్యవసాయ పనులు చేపట్టాలని,పంటల ఎంపికలో శాస్త్రీయ విధానాలను అనుసరించాలని సూచించారు.
దృశ్యశ్రవణ మాధ్యమం ద్వారా అవగాహన
రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా ఇరిగేషన్,భూగర్భ జలవనరులు,వాతావరణ శాఖలతో పాటు ఇతర సంబంధిత శాఖల అధికారులు ఎల్‌నినో పరిస్థితుల్లో వ్యవసాయ రంగంపై పడే ప్రభావం,పంటల సంరక్షణ,నీటి వినియోగం,ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై రైతులకు వివరించారు.దృశ్యశ్రవణ మాధ్యమం ద్వారా నిపుణుల సూచనలను నేరుగా రైతులకు చేరవేస్తూ అవగాహన కల్పించారు.
కడ్తాల్,ముద్విన్ రైతువేదికల్లో కార్యక్రమం
కడ్తాల్ మండలంలోని కడ్తాల్,ముద్విన్ రైతువేదికల్లో రైతునేస్తం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలను రూపొందించుకోవాలని,నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు.ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏఈఓ అనూష,హార్టికల్చర్ హెచ్ఈఓ శ్రవణ్,మిషన్ భగీరథ సిబ్బంది,రైతులు గోరేటి గణేష్,కుంభం గోపికృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
