- ఎమ్మెల్యే కే. మదన్ మోహన్ రావు
- తాడ్వాయి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని సమగ్రంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని స్థానిక ఎమ్మెల్యే కె. మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao) స్పష్టం చేశారు. బుధవారం తాడ్వాయి మండల పరిధిలో పలు అభివృద్ధి పనులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ రావులతో కలిసి ఆయన ప్రారంభించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) ఆవరణలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు, బ్రహ్మాజీవాడి గ్రామంలో రూ. 5 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

అనంతరం తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సౌకర్యార్థం రూ. 10.50 లక్షలతో నిర్మించిన నూతన అదనపు తరగతి గదులు ప్రారంభీంచారు. కృష్ణాజివాడి గ్రామంలో రూ. 10 లక్షలతో నిర్మించిన మహిళా సమైక్య భవనాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao) మాట్లాడుతూ… నియోజకవర్గంలో విద్య, రవాణా, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. తాడ్వాయి మండల పరిధిలోని సమస్యలను పరిష్కరించి, మండలానికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తూ తన శక్తివంచన లేకుండా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.


బాధిత కుటుంబానికి పరామర్శ అభివృద్ధి కార్యక్రమాల అనంతరం, చందాపుర్ గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన మైనార్టీ నాయకుడు హుస్సేన్ నివాసానికి ఎమ్మెల్యే వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బండారి సంజీవులు, అధికార ప్రతినిధి శౌకత్ అలీ, మండల ఉపాధ్యక్షులు రాజీవ్, గైని శివాజీ, మాజీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అంబీర్ శ్యామ్‌రావు, శ్రీకాంత్, మేకల రాజు, జలంధర్ రెడ్డిలతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
