- యాచకురాలిని ఢీకొట్టిన కారు.. అక్కడికక్కడే మృ*తి
- శివాలయం సమీపంలోకి కారు ఎలా వెళ్లింది? అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కొండపై విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొండపై కొన్ని సంవత్సరాలుగా యాచకురాలిగా జీవిస్తున్న ఈశ్వరమ్మను TS 32 F 1999 నంబర్ గల కారు ఢీకొనడంతో(Accident) ఆమె అక్కడికక్కడే మృ*తి చెందింది. ప్రమాదానికి కారు అతివేగం, డ్రైవర్ అజాగ్రత్తే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.కొండపైకి వచ్చిన కారు సాధారణంగా వాహనాలు పార్కింగ్ చేసే ప్రాంతంలో నిలపకుండా శివాలయం సమీపం వరకు వెళ్లడం ఈ ప్రమాదానికి దారితీసిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శివాలయం వరకు వాహనం వెళ్లేందుకు అనుమతి ఎలా లభించింది? అసలు అక్కడి వరకు కారును అనుమతించిన వారు ఎవరు? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.“కారు శివాలయం వరకు వెళ్లకుండా నిర్దేశిత పార్కింగ్ ప్రాంతంలోనే నిలిపి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదేమో” అంటూ భక్తులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొండపై వాహనాల నియంత్రణ, పార్కింగ్ నిబంధనల అమలుపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతురాలిని యాదగిరిగుట్టకు చెందిన ఈశ్వరమ్మగా గుర్తించారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, డ్రైవర్ నిర్లక్ష్యం, వాహనం కొండపైకి వచ్చిన విధానం తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దర్శనాలు నిలిపివేత
ప్రమాదంలో మహిళ మృతి చెందడంతో ఆలయ అధికారులు కొంతసేపు దర్శనాలను నిలిపివేసినట్లు సమాచారం. ఆలయ సంప్రోక్షణ అనంతరం తిరిగి దర్శనాలను పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనతో కొండపై భక్తుల్లో విషాదం నెలకొంది. వాహనాల నియంత్రణ, భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని భక్తులు కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
