Homeఆదాబ్ ప్రత్యేకంLand Scam | నాడు సర్కార్ భూమి.. నేడు ప్రైవేట్ భూమి

Land Scam | నాడు సర్కార్ భూమి.. నేడు ప్రైవేట్ భూమి

మంఖల్‌లో అన్యాక్రాంతమైన 35 ఎకరాలు!

  • రూ. వందల కోట్ల విలువైన భూమిపై భూమాఫియా కన్ను?
  • సర్వే నం. 608, 609, 610ల్లో 35 ఎకరాల 26 గుంటల భూమి
  • 1954–55 పహాణిలో ‘సర్కార’.. తర్వాత ప్రైవేట్ పట్టాలు ఎలా?
  • సబ్-డివిజన్లు.. మ్యూటేషన్లు, పాస్‌బుక్‌లు, నాలా మార్పులు
  • నాటి రెవెన్యూ అధికారుల పాత్రపై తీవ్ర ఆరోపణలు
  • రికార్డుల మార్పులపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్

రాష్ట్ర రాజధాని నగరానికి కూతవెటు దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో భూమాఫియా అరాచకం తారాస్థాయికి చేరింది. పాలకవర్గాల కండ్లుగప్పి, ప్రభుత్వ అధికారుల అండదండలతో వందల కోట్ల రూపాయల విలువైన వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల పరం అవుతున్న వైనం(Land Scam) తాజాగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, మంఖల్ గ్రామ పరిధిలో ఏకంగా 35 ఎకరాల 26 గుంటల విశాలమైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైన తీరు చూస్తే రెవెన్యూ వ్యవస్థ ఎంతలా భ్రష్టపట్టిందో ఇట్టే అర్థమవుతోంది. రికార్డుల్లో ‘సర్కార’ భూమిగా ఉన్న ప్రాంతం.. రాత్రికి రాత్రి ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూమిగా ఎలా మారిపోయింది? దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే కోణంలో సంచలన నిజాలు బయటపడుతున్నాయి.

- Advertisement -

కాగితాలపై ‘సర్కార’.. ఆచరణలో ‘పట్టా’!Land Scam

ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన మంఖల్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 608, 609 మరియు 610 లలోని సుమారు 35 ఎకరాల పైచిలుకు భూమిపై దశాబ్దాలుగా తీవ్రమైన రెవెన్యూ రికార్డుల వ్యత్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ భూమికి సంబంధించి అందుబాటులో ఉన్న 1954–55 పహాణి రికార్డులో పట్టాదార్ కాలమ్‌లో స్పష్టంగా ‘సర్కార’ అని నమోదై ఉంది. అంటే ప్రాథమికంగా ఇది ప్రభుత్వ భూమి అనే విషయం చారిత్రక రికార్డుల ద్వారా స్పష్టమవుతోంది. ఇలాంటి ప్రభుత్వ భూమిని ఎటువంటి చట్టబద్ధమైన పద్ధతులు లేకుండా, రికార్డులను తారుమారు చేసి ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూమిగా మార్చేశారనేది ప్రధాన ఆరోపణ.

సెత్వార్ రికార్డులే లేవు.. మరి ఆమోదం ఎవరిచ్చారు?

ఈ భారీ కుంభకోణంలో అత్యంత విస్మయకరమైన మరియు కీలకమైన అంశం సెత్వార్ రికార్డులకు సంబంధించినది. జిల్లా సర్వే అధికారి రికార్డుల ప్రకారం.. మంఖల్ గ్రామానికి సంబంధించిన సర్వే నం. 608, 609, 610ల సెత్వార్ రికార్డులు అసలు అందుబాటులోనే లేవని అధికారికంగా స్పష్టం చేశారు. మూల రికార్డులు లేనప్పుడు, నాటి తహసీల్దార్ నివేదికలో ఏ సెత్వార్ ఆధారంగా ఈ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మూలాలు లేని రికార్డులను సృష్టించి, ప్రభుత్వ ఆస్తిని దారాధత్తం చేయడంలో పెద్దఎత్తున కుట్ర జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి.

అప్పటి అధికారుల బరితెగింపు.. బినామీల పేరిట దోపిడీ!

ఈ భూ అన్యాక్రాంతం వెనుక నాటి రెవెన్యూ పెద్దల హస్తం స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అప్పటి తహసీల్దార్ మహమ్మద్ అలీ, అప్పటి డిప్యూటీ తహసీల్దార్ నవత, అప్పటి సీనియర్ అసిస్టెంట్ కృష్ణ తదితరులు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి, బినామీల పేర్లతో ఈ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరం చేసినట్లు పక్కా ఆధారాలను ‘ఆదాబ్ హైదరాబాద’ సంపాదించింది. వ్యవస్థలను మేనేజ్ చేసి, అధికారిక హోదాను అడ్డంపెట్టుకుని వందల కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టిన వైనం ఈ పత్రాల ద్వారా బట్టబయలవుతోంది.

39 సబ్-డివిజన్లు.. రియల్ ఎస్టేట్ హస్తగతం!

ఈ 35.26 ఎకరాల భూమిని అత్యంత వ్యూహాత్మకంగా చిన్న చిన్న భాగాలుగా విభజించి, వివిధ వ్యక్తుల పేరిట మరియు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల పేరిట మ్యూటేషన్లు చేయించుకున్నారు. ప్రస్తుతం ఈ భూమిలో పలువురు వ్యక్తులతో పాటు ప్రధానంగా వీకేఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, రాయా ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ వంటి సంస్థల పేరిట ఖాతాలు, సబ్-డివిజన్లు ఏర్పడ్డాయి. సర్వే నంబర్ 608, 609, 610ల పరిధిలో దాదాపు 39కి పైగా సబ్-డివిజన్లు సృష్టించబడి, పాస్‌బుక్‌లు జారీ చేయడమే కాకుండా, నాలా మార్పిడి చర్యలు కూడా జరిగినట్లు సమాచారం.

ప్రస్తుత తహసీల్దార్ మౌనం వెనుక మతలబు ఏమిటి?

ఇంతటి భారీ భూ కుంభకోణంపై పూర్తి ఆధారాలతో సహా బాధ్యత గల వ్యక్తులు మహేశ్వరం మండలం ప్రస్తుత తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, ఆయన స్పందించకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్నా కనీసం స్పందించకపోవడానికి కారణం ఏమిటని? సిబ్బంది, ఉన్నతాధికారుల పాత్రపై దర్యాప్తు జరగకుండా కాపాడే ప్రయత్నం జరుగుతోందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వానికి కనువిప్పు.. సమగ్ర విచారణకు డిమాండ్

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగా రెవెన్యూ మరియు సర్వే శాఖలు వెంటనే స్పందించి ఈ క్రింది అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాల్సిన తక్షణ అవసరం ఉంది:

  1. అప్పట్లో నడిచిన బినామీ లావాదేవీలు, ఫైళ్ల మానిప్యులేషన్‌పై సిట్టింగ్ అధికారులతో లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలి.
  2. అక్రమంగా జారీ చేసిన సబ్-డివిజన్లు, మ్యూటేషన్లు, రిజిస్ట్రేషన్లు మరియు నాలా ప్రొసీడింగ్స్‌ను తక్షణమే రద్దు చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి.
  3. ఈ అక్రమాలకు పాల్పడిన నాటి కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన యంత్రాగం నిద్రమత్తు వీడితేనే ఖజానాకు నష్టం వాటిల్లకుండా ఉంటుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉదంతంపై సుమోటోగా స్పందించి, మంఖల్ భూముల బాగోతంపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
RELATED ARTICLES

Latest News