ర్యాగింగ్ విద్యార్థుల గౌరవాన్ని దెబ్బతీసే చట్టవిరుద్ధమైన చర్య అని తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు చెరుకు మణికంఠ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శార్వాణి అధ్యక్షతన ర్యాగింగ్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మణికంఠ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

సీనియర్ విద్యార్థులు జూనియర్లను శారీరకంగా, మానసికంగా, మాటలతో, బెదిరింపులతో లేదా అవమానించే రీతిలో వేధించడం ర్యాగింగ్ కిందకు వస్తుందన్నారు. ఇది చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని తెలిపారు. ప్రతి విద్యార్థికి భయరహిత, సురక్షిత విద్యా వాతావరణం కల్పించడం అందరి బాధ్యతన్నారు.ర్యాగింగ్ నిర్మూలన కమిటీ కన్వీనర్ డాక్టర్ పాపయ్య యాదవ్, ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమ అధికారి శ్రీనివాస్‌గౌడ్, పూర్వ విద్యార్థి అజయ్ కౌండిన్య, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
