మండల పరిధిలోని పెదవీడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక బాలల గ్రామ సభను సర్పంచ్ అమరారపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు,యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని మత్తు తమ జీవితాలను చిత్తు చేస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా బాలల హక్కులు,వారికి రక్షణ కల్పించే చట్టాలు,విద్య,ఆరోగ్యం,భద్రత వంటి తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యోగ శిక్షకుడు నాగరాజు మాట్లాడుతూ యువతలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం వాటి వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి వాటి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.అలాగే యోగ ఆసనాలు నిర్వహించి ఆరోగ్యకర జీవన విధానంపై పలు కీలక సూచనలు చేశారు.ఉప సర్పంచ్ మల్రెడ్డి త్రివేణి కోటి రెడ్డి బాలలను ఉద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణ,విద్య ప్రాముఖ్యత,మంచి అలవాట్లు అలవరచుకోవాలని అవి మంచి భవిష్యత్తును అందిస్తాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు శ్రమించిన గ్రామ బూత్ లెవెల్ అధికారులను (బీఎల్వోలు) హుజూర్ నగర్ ఇఆర్ఓ చిలక కిషోర్ ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో బీఎల్వోలను శాలువాలతో ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు.ఈ సభలో గ్రామ కార్యదర్శి ప్రవీణ్,వార్డు సభ్యులు శ్రీను,గౌతమి,వెంకటేశ్వర్లు గ్రామ పెద్దలు,వివిధ శాఖల అధికారులు,గ్రామస్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
