- గత ప్రభుత్వంలో ప్రైవేట్ శిక్షణ సంస్థల అంతులేని అవినీతి..
- ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్ లో ఉన్న సంస్థలకు రెడ్ కార్పెట్..
- ఒకే అభ్యర్థిపై రెండు పథకాల కింద నిధుల క్లెయిమ్?
- పర్యవేక్షణలో లోపాలు.. సూచనలు చేసిన నిపుణులు..
- ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణకు డిమాండ్
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. అయితే, ఈ పథకాల అమలులో కొన్ని ప్రైవేట్ శిక్షణ సంస్థలు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
గత ప్రభుత్వంలో జరిగిన తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థలో నిధుల వినియోగంపై లోకాయుక్తకు ఫిర్యాదు దాఖలైన నేపథ్యంలో, శిక్షణ సంస్థల ఎంపిక, టెండర్ ప్రక్రియ, నిధుల విడుదల, పర్యవేక్షణ వ్యవస్థలపై సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్ మరింత బలపడుతోంది.
ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్ లో ఉన్న సంస్థలకు
తెలంగాణలోనూ అవకాశాలా?
ప్రభుత్వ వర్గాలు, పలు ఫిర్యాదుల ప్రకారం, డాటాప్రో కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గతంలో బీహార్, జమ్మూ – కాశ్మీర్ రాష్ట్రాల్లో సంబంధిత అధికారుల చర్యలు (డీబార్/బ్లాక్లిస్ట్) ఎదుర్కొన్న సంస్థగా ప్రస్తావించబడుతోంది. ఈ నేపథ్యంలో, ఇటువంటి సంస్థలకు తెలంగాణలో ప్రభుత్వ శిక్షణ కార్యక్రమాల అమలుకు అవకాశాలు ఎలా లభించాయనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు.
ఒకే అభ్యర్థిపై రెండు పథకాల కింద నిధుల క్లెయిమ్?
స్కిల్ డెవలప్మెంట్ రంగంలో అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం ఒకే అభ్యర్థిని ఒకేసారి రెండు వేర్వేరు ప్రభుత్వ పథకాల కింద శిక్షణ పొందుతున్నట్లు నమోదు చేయడం. ఉదాహరణకు, ఒక అభ్యర్థికి డీడీయూ – జీ.కె.వై. నిధులతో శిక్షణ ఇస్తున్నట్లు చూపిస్తూనే, అదే అభ్యర్థిని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ లేదా ఇతర ప్రభుత్వ పథకాల కింద కూడా నమోదు చేసి ప్రభుత్వ నిధులను క్లెయిమ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..
అదేవిధంగా బీసీ, ఓసీలను ఎస్సిలుగా మార్చి చూపించి నిధులను క్లెయిమ్ చేస్తున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇంకా మరికొన్ని సంస్థలపైనా అనుమానాలు :
పరిశ్రమ వర్గాల సమాచారం. పలు ఫిర్యాదుల ప్రకారం, డాటాప్రో కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే కాకుండా మరికొన్ని ప్రైవేట్ శిక్షణ సంస్థల పనితీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సంస్థలు ఒకే అభ్యర్థిని ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వ పథకాల కింద నమోదు చేయడం, వాస్తవ శిక్షణ లేకుండానే హాజరు నమోదులు చూపించడం, ప్లేస్మెంట్ వివరాల్లో వ్యత్యాసాలు ఉండటం, అలాగే ఇతర రాష్ట్రాల్లో చర్యలు ఎదుర్కొన్నప్పటికీ తెలంగాణలో ప్రభుత్వ ప్రాజెక్టులు పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పర్యవేక్షణలో లోపాలే కారణమా?
బయోమెట్రిక్ హాజరు, సీసీటీవీ పర్యవేక్షణ, జియో-ట్యాగింగ్, ఆధార్ ఆధారిత ధృవీకరణ, స్వతంత్ర తనిఖీలు వంటి వ్యవస్థలు సమర్థవంతంగా అమలు కాకపోవడం వల్ల అక్రమాలకు అవకాశం ఏర్పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. శిక్షణ నాణ్యత, అభ్యర్థుల హాజరు, ప్లేస్మెంట్ వివరాలను పూర్తిగా పరిశీలించకుండా నిధులు విడుదల చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ప్రభుత్వానికి నిపుణుల సూచనలు :
ప్రభుత్వం ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని శిక్షణ సంస్థలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలి. ఆధార్ ఆధారిత రియల్-టైమ్ ట్రాకింగ్ వ్యవస్థను తప్పనిసరి చేయాలి. ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పథకాలలో నమోదు కాకుండా డిజిటల్ సమన్వయ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇతర రాష్ట్రాల్లో డీబార్ లేదా బ్లాక్లిస్ట్ అయిన సంస్థల వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి. ఆకస్మిక తనిఖీలు, స్వతంత్ర సామాజిక ఆడిట్లు నిర్వహించాలి. అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిన సంస్థలు, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ నిధులను తిరిగి రికవరీ చేయాలి.
సమగ్ర విచారణకు డిమాండ్ :
ప్రజాధనం నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం వినియోగించబడాల్సిన నేపథ్యంలో, ప్రభుత్వం అన్ని శిక్షణ సంస్థలపై వివక్ష లేకుండా సమగ్ర విచారణ జరిపి, శిక్షణ కేంద్రాల నిర్వహణ, అభ్యర్థుల హాజరు, ప్లేస్మెంట్ వివరాలు, నిధుల వినియోగం, టెండర్ ప్రక్రియలను పూర్తిగా పరిశీలించాలని ప్రజలు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. ఏ సంస్థ అయినా, ఏ అధికారి అయినా దర్యాప్తులో అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సామాజికవేత్తలు, విశ్లేషకులు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు.
