- కాకతీయ సంస్కృతి ఉట్టిపడేలా వరంగల్ ఎయిర్‌పోర్ట్..
- కేంద్ర మంత్రిని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి..
- వేగంగా భూసేకరణ పూర్తి చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి అభినందన..
అభివృద్ధిని రాజకీయాలతో ముడిపెట్టకూడదని, రాజకీయాలు కేవలం ఎన్నికల సమయానికే పరిమితం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటుచేయనున్న వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు వరంగల్ కేంద్రంగా ఉంటుందని, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌తో పాటు ఇతర పరిశ్రమల రాకతో నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున విమానాశ్రయం ఎంతో కీలకమని ముఖ్యమంత్రి… కేంద్రమంత్రికి వివరించారు.
భూసేకరణ ప్రక్రియ పూర్తయినందున వెంటనే టెండర్లు పిలిచి, 2028 జూన్ 2 నాటికి పనులన్నీ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్‌లో రక్షణ శాఖ ఆధీనంలోని ఎయిర్‌పోర్ట్‌తో పాటు పౌర విమానాశ్రయాన్ని కూడా నిర్మించాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ రెండు విమానాశ్రయాల్లోనూ విమాన శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సీప్లేన్‌లు నడిపే అంశాన్ని పరిశీలించాలని కోరగా, దీనిపై తగిన ప్రతిపాదనలు అందజేయాలని కేంద్రమంత్రి సూచించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రం చేయనంత వేగంగా తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు.
