- ఫ్రీడమ్ కోసమే జెన్ జెడ్ ఉద్యోగులు..
- ఈ ఎం ఐ లు కట్టడానికి ఇష్టపడని యువత..
భారతదేశం యువత ఆలోచనా ధోరణిలో ప్రస్తుతం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడం కంటే ఆర్థిక స్వాతంత్య్రం సాధించడానికే మిలీనియల్స్, జెన్-జెడ్ ఉద్యోగులు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. గృహాల ధరలు, వడ్డీ రేట్లు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, దశాబ్దాల పాటు గృహ రుణాలకు కట్టుబడి ఉండటం కంటే, అద్దె ఇళ్లలో నివసిస్తూ ఆదా చేసిన సొమ్మును ఇతర మార్గాల్లో పెట్టుబడిగా పెట్టేందుకే మొగ్గు చూపుతున్నారు.
గృహ రుణాల ఈఎంఐలతో పోలిస్తే, నెలవారీ అద్దె చెల్లింపులే తక్కువగా ఉండటం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏళ్ల తరబడి రుణ భారాన్ని మోయడం కంటే, ఆ నిధులను ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ద్వారా త్వరగా ఆర్థిక స్వేచ్ఛను సాధించవచ్చని నేటి తరం భావిస్తోంది. అంతేకాకుండా, అద్దె ఇళ్లలో నివసించడం వల్ల మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ఇతర నగరాలకు సులభంగా మారే వెసులుబాటు ఉంటుందని, ఇది తమ కెరీర్ పురోగతికి తోడ్పడుతుందని వారు విశ్వసిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ రంగంలో యువ కొనుగోలుదారుల సందడి కనిపిస్తున్నప్పటికీ, మెట్రో నగరాల్లో ఆస్తుల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరడం ఈ కొత్త ధోరణికి దారితీస్తోంది. ఇంటి కొనుగోలు కోసం చెల్లించే డౌన్ పేమెంట్, ఈఎంఐ మొత్తాలను స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిగా పెడితే దీర్ఘకాలంలో మెరుగైన రాబడి వస్తుందనేది వారి ప్రధాన వ్యూహం.
