Homeఆదాబ్ ప్రత్యేకంEncroachment | శివ.. శివ.. ఇదేమీ ఘోరం..

Encroachment | శివ.. శివ.. ఇదేమీ ఘోరం..

  • లింగ మూర్తుల సాక్షిగా కనుమరుగవుతున్న వాగు
  • వాగును పూర్తిగా బండ రాళ్లు, మట్టితో చదును
  • ఈదుల్ల వాగును మింగుతున్న పెద్ద రియాల్టర్
  • వాగును పూడ్చేస్తే భావితరాలకు భారీ నష్టం చేకూరే అవకాశం
  • అధికార పార్టీ రైతు నాయకుని అండతోనే పూడ్చివేత..?
  • చోద్యం చూస్తున్న ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు..

శతాబ్దాల చరిత్ర కలిగిన ఈదుల్ల వాగు వందలాది మంది అన్నదాతల కుటుంబాల ఆకలిని తీర్చింది. గతంలో రైతులకు సాగునీరు,త్రాగునీరు అందించిన ఈదుల్ల వాగు నేడు మాయం అయిపోతుంది. భూ ఆక్రమార్కుల ఆక్రమణకు గురవుతుంది. నేటి వరకు ఈ వాగులు, కుంటల నుంచి వ్యవసాయ రంగానికి నీరు చేరడంతో పంటలు పండి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సహాయపడేవి.

అలాంటి వాగులు,కుంటలు నాడు నీటితో కలకళలాడి, నేడు కనీసం చూడడానికి అవకాశం లేకుండా రూపు రేఖలు మాయమవుతున్నాయి. కానీ ఓ ప్రబుద్ధుడు వాగును చాపకింద నీరుల కబ్జా చేయడంతో పాటు పూడ్చి వేస్తుండటంతో శివ… శివ..ఇదేమి ఘోరం అంటూ రైతులు, ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

- Advertisement -

వివరాల్లోకి వెళితే నందిగామ మండల కేంద్రం, అప్పారెడ్డిగూడ గ్రామల శివారులోని ప్రసిద్ధిగాంచిన పురాతన లింగమూర్తుల శివాలయం ఉంది.ఈ శివాలయానికి గతంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నడుచుకుంటూ వచ్చి ఈ వాగులో ప్రవహించే నీళ్లతోనే శుద్ధి చేసుకుని దర్శనం చేసుకునేవారు భక్తులు, ప్రజలు కుటుంబ సభ్యులతో వారోత్సవాలకు, మహాశివరాత్రి పర్వదినం రోజుల్లో ఈ దేవాలయానికి వెళ్లేవారు ఈ వాగు దాటడానికి కాస్త ఆలోచించేవారు.

Edulla Vagu encroachment in Nandigama

అలాంటి ప్రసిద్ధిగాంచిన వాగును దాదాపు పూర్తిగా ఆక్రమణకు గురైంది.ఈ వాగు దూసకల్ చెరువు, అంబాపురం చెరువులు నిండితే వాటి అలుగు ఈదుల్ల వాగు,నల్లగుంట పాటు కాలువ నుంచి నేరుగా నర్సాప్పగూడ గ్రామంలోని అక్కమ్మ చెరువుకు, అక్కడి నుంచి హిమాయత్ సాగర్ కి వెళ్తాయి.అలాంటి వాగులను చదును చేసి మాయం చేయడం మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

భావితరాలకు భారీ నష్టం.. వాగులు, కాలువలను పూడ్చి వేయడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయని రైతులు, మేధావులు పేర్కొంటున్నారు.ముఖ్యంగా, వర్షపు నీరు వెళ్ళడానికి దారి లేక వరదలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని, అలాగే నీళ్లు నిలువ లేకపోవడంతో భూమిలోకి నీరు చేరదు.భూగర్భ జలాల నీటి మట్టం పడిపోతుంది.దీనివల్ల బోర్లు, బావులు ఎండిపోతాయి. వ్యవసాయానికి నీరు అందక పంటలు దెబ్బతింటాయి. అంతేకాదు, పక్షులు, జంతువుల సహజ నివాసాలు నాశనమై పర్యావరణానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ప్రధానంగా భూ గర్భ జలాలు ఎండిపోవడంతో భావితరాలకు వారికి భారీ నష్టం వాటిల్లుతుందని మేధావులు, విశ్లేషకులు పేర్కొంటున్నారు.

వాగు పూడికకు కలిసొచ్చిన బ్రిడ్జ్.. నందిగామ మండల కేంద్రం నుంచి వీర్లపల్లి గ్రామం మార్గ మధ్యంలో ప్రవహించే పెద్ద వాగు వర్షాలు కురిసినప్పుడు రాకపోకలకు వాహనదారులు,ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నూతనంగా బ్రిడ్జ్ వేసేందుకు పనులకు శంకుస్థాపన చేశాడు.ఇక వాగు నుంచి చుట్టుపక్కలకు నీళ్లు వెళ్లకుండా, ఒకే మార్గంలోకి మళ్లించడంతో ఈ ఈదుల్ల వాగులోకి నీళ్ల రాకపోకలు ఆగిపోయాయి.అదే అదునుగా భావించి ఎన్నో ఏళ్లుగా ఉపయోగంలో ఉన్నటువంటి వాగును పెద్ద, పెద్ద బండరాళ్లను వేస్తూ, అక్రమంగా తరలించిన మట్టి, పరిశ్రమలోని నిరూపయోగ వ్యర్థాలతో దర్జాగా పూడ్చి వేయడం చూసి స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Edulla Vagu encroachment in Nandigama01

అధికార పార్టీ రైతు నాయకుని అండతోనే.. ఎక్కడ అన్యాయం జరిగిన ఎదిరించి న్యాయం చేయాల్సిన అధికార పార్టీ నాయకులు భావితరాలకు నష్టం చేకూరే విషయాల్లో జోక్యం చేసుకుని అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ రైతుపై గతంలో కూడ అనుమతులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నాడని, పలుమార్లు అధికారులకు పిర్యాదు చేసినప్పటికీ,అధికారులను తన రాజకీయ చాతుర్యంతో భయబ్రాంతులకు గురిచేసి, ప్రస్తుతానికి కూడ తన వ్యాపారాలు సజావుగా సాగిస్తున్నాడని గుసగుసలు కూడ వినిపిస్తున్నాయి.

గతంలో పరిశ్రమ ప్రహారి కూల్చివేత.. గతంలో ఇదే ఈదుల్ల వాగును అనుకుని ఓ పరిశ్రమ నిర్వాహకులు ప్రీ క్యాస్ట్ తో చుట్టూ ప్రహరీ గోడను నిర్మించారు. విషయం తెలుసుకున్న రెవిన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు నోటీసులు జారీచేసి వాగును అడ్డంగా కట్టిన ఫ్రీ క్యాస్ట్ గోడను కూల్చివేశారు. ఆ సమయంలో కూల్చివేత చర్చనీయాంశంగా మారింది.అధికారులు తీరుపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.అధికారులు తలచుకుంటే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయని వారి నిర్లక్ష్యంతోనే ఇలా అక్రమార్కులు, రియల్టర్లు రెచ్చిపోతున్నారని ప్రజలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఈ వాగు ఆక్రమణపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

చోద్యం చూస్తున్న అధికారులు.. ప్రభుత్వ అధికారులు డబ్బున్నోడికి వత్తాసు పలుకుతూ, సామాన్య ప్రజలపై కొరడా ఝుళిపించడం ఎక్కడైనా సర్వసాధారణంగా వింటుంటాం, చూస్తుంటాం. కానీ ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవని ప్రజలు భావించినప్పటికీ అవి నీటిమీద మూటవలె తేలియాడుతున్నాయి. సాక్షాత్తు హెచఎండిఎ పటంలో, ఇరిగేషన్, రెవిన్యూ శాఖల కార్యాలయాల్లోని మ్యాపుల్లో స్పష్టంగా ఈ వాగు కనిపిస్తుంది.చుట్టుపక్కల ప్రజలు, రైతులు, మేధావులు గతంలో పెద్ద వాగు ఉండేదని, వాడుకలో కూడా ఉండేదని చెబుతున్నారు. కానీ ఈ విషయం సంబంధిత అధికారు లకు తెలిసిన మౌనం వహించడం, అక్రమార్కులకు సహకరిం చడం మతలబు ఏమిటోనని అధికారుల తీరుపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News