Friday, June 26, 2026
Homeనల్లగొండChandur | డాక్యుమెంట్ రైటర్ పంపితేనే రైట్, లేదంటే వెరీ లైట్…?

Chandur | డాక్యుమెంట్ రైటర్ పంపితేనే రైట్, లేదంటే వెరీ లైట్…?

  • సామాన్యులకు నిబంధనల అడ్డంకులు.. బ్రోకర్లకు రెడ్ కార్పెట్ !

నల్లగొండ జిల్లా చండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దళారీ వ్యవస్థ రాజ్యమేలుతోంది. ఆన్‌లైన్ విధానం ద్వారా ప్రభుత్వం పారదర్శకతను పెంచాలని భావిస్తుంటే, ఇక్కడి అధికారులు మాత్రం కాసుల కోసం నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. దళారుల ద్వారా వచ్చే ఫైళ్లకు అడ్డదారిన పనులు కానిస్తూ.. నేరుగా వచ్చే సామాన్య ప్రజలను సాంకేతిక కారణాల పేరుతో ముప్పుతిప్పలు పెడుతున్నారు.

సామాన్యులకు చుక్కలు.. బ్రోకర్లకు స్పాట్ రిజిస్ట్రేషన్లు

- Advertisement -

తాజాగా మంగళవారం ఓ వ్యక్తి దళారీని ఆశ్రయించకుండా నేరుగా చలాన్లు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వెళ్లాడు. పత్రాలను పరిశీలించిన అధికారి “ఏ డాక్యుమెంట్ రైటర్ పంపారు?” అని బాధితుడిని ప్రశ్నించడమే కాకుండా, అనవసరమైన రశీదులు అడుగుతూ రిజిస్ట్రేషన్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పైగా ఓ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్‌తో సదరు బాధితుడికి క్లాస్ ఇప్పించడం గమనార్హం.

మరోవైపు బ్రోకర్ల ద్వారా వచ్చే ఫైళ్లకు మాత్రం రూల్స్ వర్తించడం లేదు. ఎలాంటి ముందస్తు స్లాట్ బుకింగ్, ఆన్‌లైన్ చలాన్లు లేకుండానే అధికారులు తమ ప్రత్యేక లాగిన్ అధికారాలను దుర్వినియోగం చేస్తూ అప్పటికప్పుడు స్పాట్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బుకాయిస్తున్న అధికారులు.. విచారణకు డిమాండ్

ఈ వ్యవహారంపై వివరణ కోరగా.. సెలవులో ఉన్న సబ్ రిజిస్ట్రార్ “అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోంది, మధ్యవర్తుల ప్రమేయం అవసరం లేదు” అని చెప్పగా, తాత్కాలిక బాధ్యతల్లో ఉన్న ఇన్‌చార్జి అధికారి మాత్రం ‘స్లాట్ సమయం ముగిసిందని, పత్రాల్లో తప్పులు ఉన్నందునే రీ-షెడ్యూల్ చేసుకోమని చెప్పామని’ బుకాయించారు.

ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్న ఈ వ్యవహారంపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరగాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు స్పందించి చండూరు కార్యాలయంలోని సర్వర్ లాగ్స్, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే అక్రమార్కుల బండారం బయటపడుతుందని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News