కబ్జాలతో కుంచించుకుపోతున్న కొత్తకుంట చెరువు..
- నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై అనుమానాలు
- స్టేటస్ కో ఉన్నా కొనసాగుతున్న నిర్మాణాలు
- భూదాన్ భూముల్లో యథేచ్ఛగా క్రయవిక్రయాలు
- హెచఎండీఏ, నీటి పారుదల శాఖ హెచ్చరికలు బుట్టదాఖలు
- 22-ఏ భూముల బదిలీలపై తీవ్ర విమర్శలు
- సమగ్ర విచారణకు ప్రజాసంఘాల డిమాండ్
చట్టాలు చుట్టా లుగా మారితే, ప్రభుత్వ నిబంధనలు కాగితాలకే పరిమితమైతే, వ్యవస్థలను తమ గుప్పిట్లోకి తీసుకోగల సత్తా ఉంటే చాలు.. చెరువులైనా, భూదాన్ భూములైనా మింగేయ వచ్చని నిరూపి స్తోంది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ‘సిరిగిరిపురం’ భూదందా. ఇక్కడ సాగుతున్న అక్రమ లీలలు, అధికార యంత్రాంగం ప్రదర్శిస్తున్న నిస్సహాయత చూస్తుంటే సామాన్యుడికి న్యాయవ్యవస్థపై నమ్మకం పోయేలా ఉంది.
కొత్తకుంట చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం (ఎఫ్.టి.ఎల్), రక్షణ వలయ (బఫర్ జోన్) ప్రాంతాలను కబ్జా చేయడమే కాకుండా, పేదల కోసం కేటాయించిన భూదాన్ భూములు, ప్రభుత్వం నిషేధిత జాబితా (సెక్షన్ 22-ఏ) లో పెట్టిన భూములను సైతం అడ్డగోలుగా క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఇక్కడి ప్రకృతి సంపదను ధ్వంసం చేస్తూ, నిర్మాణాల పేరిట సిమెంట్లు-ఇటుకల అరణ్యంగా మారుస్తున్నారు.
హైకోర్టు ఆదేశాలకే దిక్కులేదా?
నీటి పారుదల శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్.ఎమ్.డి.ఏ) అధికారులు గతంలోనే (షోకాజ్ నోటీస్ నంబర్:3462/ప్లానింగ్/దక్షిణ మండలం/హెచఎండిఏ/2024, తేదీ: 06-01-2025) ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని నోటీసులు జారీ చేశారు. అంతకంటే ఘోరం ఏమిటంటే..
గౌరవ హైకోర్టు (రిట్ పిటిషన్ సంఖ్య. 4678/2024) ఈ ప్రాంతంలో యథాతథ స్థితిని కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. న్యాయస్థానం ఆదేశాలు ఉన్నా, అధికారిక నోటీసులు పంపినా.. ఇప్పటికీ అక్కడ నిర్మాణ కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయి? ఈ మాఫియా వెనుక ఉన్న ఆ ‘అదృశ్య హస్తం’ ఎవరిది? ఉన్నత న్యాయస్థానాల కంటే ఈ భూబకాసురులు ఎక్కువైపోయారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆక్రమణదారుల గుప్పిట్లో కొత్తకుంట..
ఇప్పటివరకు చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం, రక్షణ వలయ పరిధిని క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో గుర్తించి, శాశ్వత సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. అధికారుల ఈ తాత్సారమే ఆక్రమణదారులకు వరంగా మారింది. హద్దులు లేకపోవడంతో చెరువును క్రమంగా మింగేస్తూ పక్కా ప్రణాళికతో పనులు కానిచ్చేస్తున్నారు.
భూదాన్ భూములపై అక్రమ కట్టడాలు..
సర్వే నంబర్ 68లోని భూములు భూదాన్ యజ్ఞ బోర్డుకు చెందినవిగా రికార్డులు చెబుతున్నా.. అక్కడ ఇష్టారాజ్యంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. పేదలకు చెందాల్సిన భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఎలా ఆక్రమిస్తారు? దీనిపై ఉన్నతాధికారులు ఎందుకు విచారణ జరపడం లేదు. మరోవైపు, ఇదే సర్వే నంబర్ 68 భూములను ప్రభుత్వం (లేఖ సంఖ్య. ఈ1/4231/2024, తేదీ: 28-10-2025 ద్వారా) సెక్షన్ 22-A క్రింద నిషేధిత జాబితాలో చేర్చింది.
భారతీయ భూముల నమోదు చట్టం-1908 ప్రకారం ఈ భూములను క్రయవిక్రయాల కింద నమోదు చేయడం నేరం. కానీ, ఇక్కడ చట్టాలను తుంగలో తొక్కి యథేచ్ఛగా భూముల బదిలీలు జరిగిపోతున్నాయి. ఉప-నమోదు (సబ్-రిజిస్ట్రార్) కార్యాలయాల్లో ఏం జరుగుతోంది. అధికారులు కళ్ళు మూసుకొని సంతకాలు పెడుతున్నారా, లేక ‘మామూళ్ల’ మత్తులో జోగుతున్నారా? అని స్థానికులు మండిపడుతున్నారు.
ఈ భారీ భూ కుంభకోణం, పర్యావరణ విధ్వంసంపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ క్రింది చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొత్తకుంట చెరువుకు తక్షణమే ఉమ్మడి సర్వే నిర్వహించాలి. పూర్తి స్థాయి నీటి మట్టం, రక్షణ వలయ హద్దులను ఖరారు చేసి శాశ్వత సరిహద్దు రాళ్లను నాటాలి.
హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ సాగుతున్న నిర్మాణా లను వెంటనే కూల్చివేసి, పనులను పూర్తిగా నిలిపివేయాలి. నిషేధిత జాబితా మరియు భూదాన్ భూములపై జరిగిన అక్రమ భూముల నమోదులపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన అధికారులను ఉద్యోగం నుండి తొలగించాలి. ఈ ప్రాంతంలో అక్రమంగా ఇచ్చిన భవన నిర్మాణ అనుమతులు, భూముల విభజన (లేఅవుట్) అనుమతులు, నిరాక్షేపణ పత్రాలను (ఎన్.ఓ.సి) సమగ్ర విచారణ జరిపి తక్షణమే రద్దు చేయాలి.
చెరువులు, భూదాన్ భూములు, నిషేధిత భూముల వ్యవహారాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున.. ఉన్నత స్థాయి కమిటీతో సమగ్ర విచారణ జరిపించి, నిజానిజాల నివేదికను బహిర్గతం చేయాలి. అప్పుడే ప్రభుత్వ భూములకు, పర్యావరణానికి రక్షణ ఉంటుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర లేస్తుందా.. లేక ఈ అక్రమ సామ్రాజ్యానికి మౌన ముద్రతో సహకరిస్తుందో చూడాలి!
