Wednesday, June 24, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంCorruption | కరెంటు తీగల్లో అవినీతి షాక్

Corruption | కరెంటు తీగల్లో అవినీతి షాక్

మియాపూర్ అనుమతులతో.. మక్తా మహబూబ్‌పేట్‌లో కరెంటు కనెక్షన్లు

  • ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణానికి విద్యుత్ సరఫరా
  • గ్రామం పేరు మారినా క్షేత్రస్థాయి తనిఖీలు లేవు
  • ముడుపులకే మీటర్లు మంజూరయ్యాయా?
  • నగరపాలక మాఫియాకు విద్యుత్ శాఖ అండ?
  • 1.03 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాపై వివాదం
  • అక్రమ కనెక్షన్లు రద్దు చేయాలని ప్రజల డిమాండ్

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ‘నగర పాలక మాఫియా’ కుంభకోణంలో మరో నగ్న సత్యం వెలుగు చూసింది. పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని ప్రైవేటు బిల్డర్లకు దారాదత్తం చేస్తూ అక్రమంగా భవన వినియోగ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తే.. తామేమీ తక్కువ కాదంటూ తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు కూడా అవినీతి గంగలో మునిగితేలారు. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి, కోరలు చాచిన అవినీతితో భారీగా ముడుపులు గుంజి, అక్రమ నిర్మాణానికి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు క్షేత్రస్థాయి ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.

- Advertisement -

మియాపూర్ పత్రాలతో మక్తా మహబూబ్‌పేట్‌లో కనెక్షన్!

ఈ అక్రమ దందాలో అత్యంత విస్తుపోయే విషయం ఏమిటంటే.. సదరు బిల్డర్ సమర్పించిన నిర్మాణ అనుమతులు, పట్టణ ప్రణాళికా అధికారులు అక్రమంగా జారీ చేసిన భవన వినియోగ ధృవీకరణ పత్రంలో ‘మియాపూర్ గ్రామం’ అని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ, విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన సహాయక పరిపాలనా ఇంజనీర్ మరియు సిబ్బంది మాత్రం లంచాల మత్తులో ‘మక్తా మహబూబ్‌పేట’ గ్రామ శివారులో, 1.03 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలకు విద్యుత్ సర్వీస్ కనెక్షన్లు మంజూరు చేసేశారు.

ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, ముందస్తు ప్రణాళికతో చేసిన ప్రభుత్వ భూమి దోపిడీ.. మియాపూర్ గ్రామం పేరుతో ఉన్న నిర్మాణ అనుమతులను, భవన వినియోగ ధృవీకరణ పత్రాలను చూపిస్తే.. మక్తా మహబూబ్‌పేట్ గ్రామంలో ఏ విధంగా విద్యుత్ కనెక్షన్ ఇస్తారు? కనీసం క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేయకుండానే విద్యుత్ తీగలు ఎలా లాగారు? ఈ అక్రమ కనెక్షన్ల వెనుక ఎన్ని లక్షల రూపాయలు చేతులు మారాయి?

భవనాన్ని బట్టి రేటు.. నిలువు దోపిడీ!

విద్యుత్ శాఖ కార్యాలయంలో ఒక సామాన్యుడు చట్టబద్ధంగా కరెంటు కనెక్షన్ కావాలని దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి తిప్పించుకునే అధికారులు, ఇక్కడ ప్రభుత్వ భూమి కబ్జా అని తెలిసినా, గ్రామం పేరు మారినా రాత్రికి రాత్రే విద్యుత్ మీటర్లు ఎలా బిగించారు? దీనికంతటికీ కారణం “భారీ ముడుపులే” అని స్థానికులు, సామాజిక కార్యకర్తలు నినదిస్తున్నారు. ఒక్కొక్క విద్యుత్ కనెక్షన్‌కు, ఆ నిర్మాణ వైశాల్యాన్ని బట్టి లక్షలాది రూపాయల అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు విద్యుత్ శాఖ కార్యాలయ సిబ్బందిపై ఘాటైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ ప్రణాళికా అధికారుల కంటే ఒకడుగు ముందే వేసి, కబ్జాదారులకు విద్యుత్ శాఖ అధికారులు రాజభోగాలను కల్పించడంపై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

విజిలెన్స్ విచారణ పరిధిలోకి విద్యుత్ శాఖను కూడా చేర్చాలి!

ఈ భారీ కుంభకోణంపై సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఇప్పటికే స్పందించి ఉన్నత స్థాయి విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించారు. అయితే, కేవలం నగరపాలక అధికారుల పైనే కాకుండా, ఈ అక్రమ నిర్మాణానికి విద్యుత్ కాంతులు పంచిన విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులపై కూడా సమగ్ర విచారణ జరపాలని సామాజిక కార్యకర్తలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

మియాపూర్ పత్రాలతో మక్తా మహబూబ్‌పేట్‌లో అక్రమ కనెక్షన్ ఇచ్చిన సంబంధిత సహాయక పరిపాలనా ఇంజనీర్‌ను తక్షణమే ప్రభుత్వ విధుల్లోంచి తొలగించాలి. ఎలాంటి చట్టబద్ధత లేని, ప్రభుత్వ భూమిలో వెలిసిన ఆ అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణానికి ఇచ్చిన విద్యుత్ కనెక్షన్లను తక్షణమే తొలగించాలి (డిస్‌కనెక్ట్ చేయాలి). ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ, కబ్జాదారులతో కుమ్మక్కై ముడుపులు తీసుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది అందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతి రహిత, పారదర్శక పాలన అందించాలని అహర్నిశలు శ్రమిస్తుంటే..

అటు నగరపాలక, ఇటు విద్యుత్ శాఖ అధికారులు మాత్రం లంచాల వేటలో ప్రభుత్వ ఆశయాలకు ఘోరంగా తూట్లు పొడుస్తున్నారు. ఈ విద్యుత్ ‘చీకటి’ భాగోతంపై ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో, కబ్జాదారుల గుండెల్లో ఏ విధంగా రైళ్లు పరిగెత్తిస్తుందో వేచి చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News