Tuesday, June 23, 2026
Homeహైదరాబాద్‌Dr Vivek DSFI | నిరుద్యోగుల గర్జన ప్రభుత్వానికి మంచిది కాదు.

Dr Vivek DSFI | నిరుద్యోగుల గర్జన ప్రభుత్వానికి మంచిది కాదు.

  • డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్.

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే భారీ స్థాయిలో ఉద్యమాలు తప్పవని డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిరుద్యోగ జేఏసీ నాయకులతో కలిసి పాల్గొన్న ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వివేక్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.

రాష్ట్రంలో లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుండగా ప్రభుత్వం సరైన ప్రణాళికతో ముందుకు సాగడం లేదన్నారు. హైదరాబాద్‌ను వెంటనే ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని, స్థానిక యువతకు ఉద్యోగాల్లో న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలను దృష్టిలో ఉంచుకుని కేవలం 5 వేల పోస్టుల నోటిఫికేషన్ సరిపోదని, కనీసం 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

అలాగే నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం చేస్తున్న జీఓ నెం.46ను సవరించి, అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడేలా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకత పాటించి, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేసి, నియామకాల క్యాలెండర్ ప్రకటించాలని ఆయన కోరారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు, రిక్రూట్‌మెంట్ ప్రక్రియలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు.

ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. “నిరుద్యోగుల గర్జన ప్రభుత్వానికి మంచిది కాదు. యువత ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. హామీల అమలులో విఫలమైతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాలను ఉధృతం చేస్తాం.

అవసరమైతే ఈ ప్రభుత్వాన్ని ఎలా గద్దె దించాలో మాకు తెలుసు” అని డాక్టర్ వివేక్ స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రా నాయక్,చెర్రీ ప్రవీణ్,ఆకాష్ గౌడ్,నవీన్ పట్నాయక్,శింబు నాయక్, భూక్యా కుమార్, ప్రవీణ్, రాజు, జనార్ధన్, గూగులోతు సూర్య ప్రకాష్, సంతోష్, నిరుద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News