- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. చెన్నూరు పట్టడానికి చెందిన లింగ కృష్ణ తాను టైల్స్, మార్బుల్ వ్యాపారం నిర్వహిస్తున్నానని, అన్ లోడింగ్ సమయంలో హమాలీలు అధిక ధరలు చెబుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
మంచిర్యాల పట్టణానికి చెందిన దోమల చంద్రశేఖర్ తన కూతురు మందమర్రి లోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో ఆరవ తరగతి పూర్తి చేసిందని, మంచిర్యాలలోని వసతి గృహానికి బదిలీ చేయగలరని కోరుతూ దరఖాస్తు అందజేశారు. నెన్నెల మండలం కోనంపేట గ్రామ రైతులు తమకు ముఖ్యమంత్రి గిరి వికాస్ పథకం కింద మంజూరైన బోర్లకు విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణంలోని ఎన్ టి ఆర్ నగర్ కు చెందిన చిలుక పద్మ తాము ఉంటున్న రేకుల ఇల్లు శిథిలావస్థకు చేరుకుందని, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.


బెల్లంపల్లి పట్టణానికి చెందిన మాగంటి సౌభాగ్యవతి తాను భూభారతి పోర్టల్ లో పాస్ పుస్తకం వివరాల సవరణ కొరకు దరఖాస్తు చేసుకున్నానని, దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మందమర్రి మండలం అమరవాది కు చెందిన తోటపల్లి లత తన భర్త మరణించినందున జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
మందమర్రి మండలం గద్దెరాగడి ప్రాంతానికి చెందిన గొట్టే నరేందర్ బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లిలో అనుమతులకు మించి మట్టి తవ్వకాలు జరిగాయని, ఈ విషయమై పూర్తి విచారణ చేపట్టాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జన్నారం మండలం రేండ్లగూడ గ్రామానికి చెందిన సముద్రాల శంకర్ తమ గ్రామంలోని చెరువులపై జరిగిన అక్రమ ఆక్రమణలను తొలగించి చెరువులను పునరుద్ధరించాలని, శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

అనంతరం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్, వైద్యాధికారులతో కలిసి గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ నెల 29, 30 తేదీలలో ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 0-5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని, జిల్లా వ్యాప్తంగా 1 వేయి 836 సిబ్బంది 459 బూత్ ల ద్వారా పోలియో చుక్కల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. పోలియో వ్యాక్సిన్ సురక్షితమైనదని, అనారోగ్యంగా ఉన్నవాళ్లు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా నీటి జనిత, కీటక జనిత వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, అన్ని శాఖల సమయంతో సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాను పోలియో రహిత, ఆరోగ్య మంచిర్యాల గా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
