- జూన్ 21… ప్రపంచ సంగీత దినోత్సవం
సుప్రసిద్ధమైన చతుషష్టి కళలలో ఒకటి సంగీతం. శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ. సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది. ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమై పోయింది. సంగీతం మదిమదినీ పులకరింప జేస్తుంది. నరనరాల్లో రక్తాన్ని ఉరకలెత్తిస్తుంది. రాళ్లు రప్పలు, పశుపక్ష్యాదులు సైతం సంగీతానికి ఆనందపరవశం కావాల్సిందే. అంతటి శక్తి సంగీతానికుంది. విశ్వజనీనంగా మనసును రంజింపజేయగల మహత్తరమైన శక్తి సంగీతానిది. సంగీతం ప్రాముఖ్యతను చాటి చెప్పటానికి 1982లో ప్రారంభించ బడిందే ‘ప్రపంచ సంగీత దినోత్సవం’. ప్రతి సంవత్సరం జూన్ 21న దీనిని జరుపుకోవటం ఆనవాయితీ.
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసఃఫణిః’ అంటూ సంగీతం గొప్పదనాన్ని పెద్దలు చెబుతారు. ఆది ప్రణవ నాదమైన “ఓం”కారం నుండి ఉద్భవించినది సంగీతం.
సంగీతం ఎప్పుడు, ఎలా ఏర్పడిందో చెప్పటం కష్టం. అయితే, ఇంద్రుడు, బ్రహ్మను ఒక కళను సృష్టించమని అడగగా, బ్రహ్మ సామవేదం నుంచి పరమ శివుని సన్నిధానంలో సంగీతాన్ని సృష్టించాడని అంటారు. బ్రహ్మ ఈ సంగీతాన్ని భరతునికి నేర్పగా ఆయన భూలోకంలో సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడని చెపుతారు.

పూర్వ మానవులు తమ చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి అనేక స్వరాలను కను గొన్నారు. నెమలి కూతలోను, ఏనుగు ఘీంకారం లోనూ, కోకిల కూతలోను, గుర్రం సంకిలింపు లోనూ, ఎద్దులు వేసే రంకెల్లోనూ ఇలా అనేక జంతువుల ధ్వనుల నుంచి స్వరాలను ఏర్పరిచారు. ఈ ఆధునిక కాలంలో మనకు తెలిసిన స్వరాలు ఏడు. ఈ సప్తస్వరాలను నేడు పిలిచినట్టు షడ్జమం (నెమలి), రిషభం (వృషభ ధ్వని), గాంధారం (మేక), మధ్యమం (క్రౌంచము), పంచమం (కోకిల), దైవతం (గుర్రం) మరియు నిషాదం (గజము) అని పిలిచే వారు కాదు. పూర్వం వీటిని కృష్ణ, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్ధ, మన్ద్ర, అతిస్వర్య అని పిలిచేవారు.
ఇప్పటి స్వరాలతో పోలిస్తే, ఈ స్వరాలు ‘మగరసనిదప’ అనే స్వరాలన్నమాట. ఇవే క్రమేణా రూపాంతరాలు చెందుతూ, నేటి స్వరాల క్రమం ‘సరిగమపదని’ గా రూపు దాల్చాయి. సంగీతం మానసికోల్లాసానికే గాక, పరమాత్మను చేరుకునేందుకు ఉపయోగపడే సాధనం. “మనఃస్థితిని నియంత్రిం చడానికి సంగీతం ఒక గొప్ప మార్గం”. సంగీత ఆస్వాదన జీవితాన్ని ఉత్తమంగా చేస్తుంది . సంగీత సాధన ద్వారా మేధస్సు, ఏకాగ్రత, సహనం పెరుగుతుంది.
చుట్టూ ఉన్న జీవ జంతు జాలాలు పాడే పాటలకు ప్రేరణ పొంది, వాటిని అనుకరిస్తూ పాటలు పాడడం మొదలు పెట్టాడని చెబుతారు. ఇప్పుడు మనుషులు పాడే పలు రాగాలకు జంతువుల కలగానాలే ప్రేరణాలని అంతా అంగీకరించే అంశం. హంసధ్వని, చక్రవాక, కోకిలధ్వని, గరుడధ్వని, హంసనంది, రిషభప్రియ, గోప్రియ, భైరవ తదితర రాగాలే ఇందుకు సాక్ష్యం.
ఈ సృష్టిలో దాని స్థానం అద్భుతం. దేవతలు సైతం సంగీతాన్ని ఆరాధించినవారే. అది శ్రీకృష్ణుని చేతిలోని వేణువు కావచ్చు, పరమేశ్వరుని రంజింపజేసే ఢమరుకం కావచ్చు, చదువుల తల్లి హస్తభూషణమైన వీణ కావచ్చు. పసిపిల్లల మొదలు పండుముసలి వారి వరకు పాటకు పరవశించని మనసు ఉండదంటే అతిశయోక్తి కాదు. దేవతలు సైతం సంగీతాన్ని ఆస్వాదించే వారే. అందుకే దేవాలయాల్లో అనేక సేవల సందర్భంగా మేళతాళాలు వాయించడం, షోడసోపచార పూజల్లో గీతం శ్రావయామి అని పూజిస్తారు. అచేతనంగా మారిన శరీరాన్ని సైతం చైతన్య శీలంగా మార్చగల గొప్ప సాధనం సంగీతం.

మన దేశంలో సంగీతం వేదాల కాలంనుండి, తరువాత రాజుల కాలంలోనూ ఉన్నది. ఎందుకంటే ఆబాలగోపాలాన్ని ఆనందసాగరంలో ముంచెత్తుతుంది సంగీతం. పాటకు పరవశించని వారుండరు. ప్రకృతి సైతం సంగీతానికి స్పందిస్తుందని పెద్దలు చెబుతారు. భాషకు అతీతమైంది సంగీతం. రామాయణ, భారతాల్లో కూడా శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. యాజ్ఞవల్క్య స్మృతిలో, తాళ కృతి పరిజ్ఞానము కల్గిన వీణా వాదకులు నిస్సందేహంగా మోక్షమార్గాన్ని పొందుతారని పేర్కొన బడింది.
మానవుని శ్రమైక జీవనంలో, పని నుండే పాట పుట్టిందని చెబుతారు. రాయితో రాయిని కొట్టినప్పుడు ‘ఠక… ఠక’, రాయి నీటిలో పడ్డప్పటి ‘బుడుంగ్’, ప్రకృతిలోని సెలయేటి గలగలలు, చెట్ల ఆకుల గరగరలు, నీలాకాశంలో రివ్వున ఎగిరిపోయే పక్షుల కిలకిలా రావాలు, పాపాయి నోటి ‘ఉంగ్వా ఉంగ్వా’ ల తొలి రాగాల్లో సంగీతాన్ని గమనించారు ప్రాచీనులైన రాతి యుగపు మన పూర్వజులు.
సంగీతానికి రాళ్లను కరిగించే శక్తి వుంది, మేఘాలు వర్షిస్తాయి. ఆవులు పాలిస్తాయి. చెట్లు పుష్పిస్తాయి. సంగీతానికి ఉన్న శక్తి గురించి సామవేదం చెబుతుంది. ధ్వనితరంగాలు నాడీ వ్యవస్థమీద ఎలా పనిచేస్తుందో స్వరశాస్త్రం వివరిస్తుంది. స్వరాలూ, శ్లోకాలూ, రాగాలూ, మంత్రాలూ మనస్సుమీదే కాక, శరీరంమీద పనిచేస్తాయి అని సంగీత శాస్త్రం చెబుతుంది.
అందుకే సామాన్యుడి మొదలు మహారాజుల వరకు అందరికీ బంధువు సంగీతం.
“గీతం వాద్యం తధా నృత్యం త్రయం సంగీతముచ్చతే”, గీతము, వాద్యము, నృత్యము అను నీ మూడింటి చేరిక సంగీతమని పిలవ పడుతుందని, మరియు రాగము, స్వరము, తాళము అను నీ మూడింటి చేరికయు సంగీతమని సంగీత రత్నాకరంలో చెప్పపడింది.
సంగీత ప్రభావంలో హిందూస్తానీ వాగ్గేయకారులు తాన్‌సేన్ మేఘమాల లహరి రాగంలో వర్షాలు కూడా రప్పించాడని, రాళ్ళను కరిగించాడని చెబుతారు. సంగీత సరస్వతిని ఆరాధించి జీవన్ముక్తి సాధించవచ్చునని, మన వాగ్గేయకారులు, నాదజ్ఞానులు చెబుతారు. త్యాగయ్య, రామదాసు, చైతన్యుడు, అన్నమయ్య మొదలైన సంకీర్తనాచార్యులు సంగీతం ద్వారా భగవంతునిలో తాదాత్మ్యం చెంది ముక్తి సాధించవచ్చునని ప్రబోధించారు.
రాతియుగం నుంచి కంప్యూటర్ యుగందాకా సంగీతం స్వేచ్ఛగా రాజ్యమేలుతోంది. మన దేశంలో దాదాపు ఉత్తరాదిలో వ్యాపించి ఉన్నది ‘హిందూస్తానీ సంగీతం’ దక్షిణాదిలో ఉన్న సంగీతం. అందాలన్నీ ‘కర్ణాటక సంగీతం బాపతే.
నానా విధ పుష్ప ఫల జాతుల అందమైన చిక్కటడవి అనుకుంటే లలిత సంగీతం పరిమళాల పూల మొక్కలున్న చిరు ఉద్యానవనం.
శాస్త్రీయ సంగీతం ఎగిసిపడే అలల మహాసముద్రము అయితే, లలిత సంగీతం మనసును పలకరించే, ఆహ్లాద పరిచే తామర కొలను.
శాస్త్రీయ సంగీతంలో ‘రాగం’ విస్తృతంగా, సంపూర్ణంగా దర్శనమిస్తుంది. లలిత సంగీతంలో రాగంలోని ఒక భాగం సొగసైన భంగిమతో శ్రావ్యమైన నాద లహరులను సృష్టిస్తుంది. అన్నింటిలోనూ ఉంది ‘శృతి’ – ‘లయ’!!
ఆత్మ పల్లవించే పడవలా, వెచ్చని పాటలతో, వెండి అలలపై నిద్రిస్తున్న రాజహంసలా అలనాటి సినిమా సంగీతం నుండి కాలానికి అనుగుణ మార్పులతో, నేటి యువతకు అనుకూల మవుతున్న గల్లీ గల్లీలో దద్దరిల్లుతున్న సంగీతం రాజ్యమేలుతున్నది.
సంగీతమంటే కేవలం ఏదో ఒక పాటో, వాయిద్యమో కాదు. ఈ ప్రకృతి మొత్తం సంగీత సమ్మేళనంగానే కనిపిస్తుంది. చల్లగా వీచే గాలిలో సంగీతం వినిపిస్తుంది. కోయిల పాటలో సంగీతం ప్రతిధ్వనిస్తుంది.
పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః అన్నారు పెద్దలు. కానీ పశువులకన్నా, శిశువుల కన్నా పక్షులకు గానం గురించి బాగా తెలుసు అని ప్రకృతి నిరూపిస్తోంది. పాట అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కోయిలమ్మ. ఆ తరువాత ఏనాడూ వినకపోయినా మైనా పాట..ఆ తరువాత బాగా పాడుతుందని తెలిసిన నైటింగేల్ పాట..ఇంకొంచెం తక్కువగా రాబిన్‌పిట్ట. చిలకలు పాటలకు కాక పలుకులకు, కులుకులకు ప్రసిద్ధి మనను పొద్దున్నే నిద్దురలేపే కోడి కూడా సుప్రభాత గీతాలు పాడుతున్నా దాని కూత వైతాళిక గీతమైందే తప్ప అది గాయనిగా గుర్తింపుకు నోచుకోలేదు.
మన చుట్టూ ఎన్నో మధుర స్వరాల పక్షులు ఉన్నా వాటివి కలకూజితాలు గానే గుర్తింపు పొందాయి. పక్షి ప్రేమికులు పర్యావరణాన్ని శోధించి 980 రకాల పక్షులు పాటలు పాడతాయని వాటి పాటలు ఎంతో కమనీయంగా ఉంటాయని గుర్తించారు. ఇవి ఇంత వరకు మన దాకా వచ్చిన పాటలు. ఈ విశాల ప్రపంచంలో ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో. ఎన్ని నైటింగేల్స్, మరెన్ని మైనాలు అడవిగాచిన వెన్నెలలా అడవులకే అంకితమై ఉన్నాయో! ఎడారిలో పాటలు పాడుతూ రసజ్ఞతకు నోచుకోక బ్రహ్మ మందభాగ్యానికి ప్రతీకలుగా మిగిలి పోతున్నాయో!!
