- రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు
రాష్ట్రంలో నీట్-2026 పరీక్ష ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి అదనపు డి జి పి మహేష్ భగవత్, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సి.పి.లు, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీట్-2026 పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు, వరి ధాన్యం కొనుగోలు, జూన్ 9న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి సభ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 21వ తేదీన జరగనున్న నీట్-2026 పరీక్షకు 24 పట్టణాలలో 208 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 72 వేల 956 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఇందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర, జిల్లా సమన్వయ కమిటీలు అందుకు అనుగుణంగా పని చేయాలని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులపై తక్షణమే స్పందించాలని, వదంతులు వ్యాప్తి కాకుండా చూడాలని తెలిపారు.

ప్రభుత్వ సంస్థలలో మాత్రమే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాలలో సి సి కెమెరాలు ఏర్పాటు చేయాలని, అంతర్జాతీయ యోగా దినోత్సవం దృష్ట్యా పరీక్ష నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. పరీక్ష రోజున ప్రశ్న పత్రాల తరలింపు, అభ్యర్థుల రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, అభ్యర్థుల తనిఖీ, బందోబస్తు తదితర ఏర్పాట్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 71 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి 4 వేల 488 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసి వేయడం జరిగిందని తెలిపారు.
ఇప్పటి వరకు 10 లక్షల 58 వేల మంది రైతుల ఖాతాలలో 13 వేల 577 కోట్ల రూపాయల కనీస మద్దతు ధర జమ చేయడం జరిగిందని, మిగిలిన ధాన్యాన్ని కూడా త్వరితగతిన కొనుగోలు చేసి కొనుగోలు ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మండల మహిళా సమాఖ్యకు 1 చొప్పున 553 బస్సులను మంజూరు చేయడం జరిగిందని, ఈ బస్సులను జూన్ 9వ తేదీన సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహిళా సమాఖ్య సభ్యులకు లాంఛనంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు, సభకు మహిళా సమాఖ్య సభ్యుల తరలింపుపై ఆయా జిల్లాల గ్రామీణ అభివృద్ధి అధికారులు, ఆర్ టి సి రీజినల్ మేనేజర్లు సమన్వయంతో పని చేసి సభను విజయవంతం చేయాలని తెలిపారు. జూన్ 12న రాష్ట్రంలోని పాఠశాలల పునః ప్రారంభానికి విద్యార్థులకు అందజేయవలసిన యూనిఫామ్ లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు.
అదనపు డి జి పి మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలలో సి సి కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు ఎప్పటికప్పుడు స్పందించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మహిళా అభ్యర్థుల తనిఖీలో మహిళ కానిస్టేబుల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో 1 వేయి 204 మంది అభ్యర్థులు నీట్-2026 పరీక్షకు హాజరు కానున్నారని, పరీక్ష నిర్వహణ కొరకు జిల్లాలో 5 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకొని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వర్షాల దృష్ట్యా కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచడం జరిగిందని, రవాణా సంబంధిత ఏర్పాట్లు చేయడం జరిగిందని, తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిసిపి భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా విద్యాశాఖాధికారి లలిత, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
