- హెచ్చరించిన వై ఎస్ షర్మిల..
- నంద్యాలలో వై ఎస్ విగ్రహం ధ్వంసం..
నంద్యాల జిల్లాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె హెచ్చరించారు. ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నంద్యాలలోని శ్రీనివాస సెంటర్‌లో వైఎస్ఆర్ విగ్రహంపై ఓ వ్యక్తి దాడి చేసి ధ్వంసం చేశాడని షర్మిల తెలిపారు. పట్టపగలు ఈ ఘటన జరుగుతుంటే, అక్కడే ఉన్న పోలీసులు నిలువరించకపోవడం హేయమైన చర్య అని ఆమె విమర్శించారు.
దాడి చేసిన వ్యక్తికి మానసిక స్థితి బాగోలేదని చెప్పి పోలీసులు చేతులు దులుపుకోవడం సరికాదని అన్నారు. ఇది చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపు ఉందని షర్మిల ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇలాంటి ఘటనలను చూస్తూ చోద్యం చూడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ విగ్రహాలపై జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడితో పాటు, అతని వెనుక ఉన్న శక్తులెవరో తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పాత విగ్రహం స్థానంలో వెంటనే కొత్తది ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో నంద్యాలలో అదే సెంటర్‌లో తాను ఆమరణ దీక్షకు దిగుతానని ముఖ్యమంత్రిని హెచ్చరించారు.
