- అత్యంత అరుదైన వైరస్ రకానికి చెందినది..
- ఎలాంటి టీకా గానీ, వైద్యం గానీ లేదు..
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా మహమ్మారి వ్యాప్తిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర స్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ మహమ్మారి వ్యాప్తిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఎందుకంటే, ఇది అత్యంత అరుదైన వైరస్ రకానికి చెందినది. దీనికి ఎలాంటి టీకా లేదు. డీఆర్ కాంగోలో అంతర్గత సంఘర్షణలు నెలకొన్న ప్రాంతంలో ఈ కేసులు నమోదవుతున్నాయి. ఎబోలా ఒక అరుదైన, వైరస్ వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధి.
ఎబోలా వైరస్‌లు సాధారణంగా జంతువులకు సోకుతాయి. ముఖ్యంగా ఒక రకమైన గబ్బిలాలకు (ఫ్రూట్ బ్యాట్స్‌కు) వస్తుంది. వైరస్ సోకిన వాటిని తిన్నా, లేదా వాటిని తాకినా మనుషులలోనూ ఈ వైరస్ వ్యాప్తి ప్రారంభం కావచ్చు. దీని లక్షణాలు బయటపడేందుకు రెండు నుంచి 21 రోజుల సమయం పడుతుంది. హఠాత్తుగా అలసట, జ్వరం, తలనొప్పితో ఫ్లూలాగా కనిపించడం మొదలవుతుంది. ఈ వ్యాధి తీవ్రమవుతున్న కొద్దీ, వాంతులు, విరేచనాలు ఎక్కువవుతాయి. ఇది అవయవాల వైఫల్యానికి కూడా కారణమవుతుంది. కొంతమంది రోగులలో బాహ్య, అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. వ్యాధి పీడితుని రక్తం, వాంతులు వంటి స్రావాలను తాకడం ద్వారా ఈ వైరస్ ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తుంది.
